దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూ.1.60 కోట్ల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కవరేజీ అందజేయాలని నిర్ణయించింది. దీని కోసం ఎస్‌బీఐ మరియు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ సదుపాయం రైల్వే శాఖలో శాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ ఎంఓయూ ప్రకారం, రైల్వే విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ రూ.1 కోటి వరకు లభిస్తుంది. అంతకుముందు ఇది కేవలం రూ.1.20 లక్షల వరకు మాత్రమే ఉండేది. అదనంగా, ప్రమాదంలో మరణించిన సందర్భంలో రూ.1.60 కోట్ల ఎయిర్ యాక్సిడెంట్ డెత్ కవరేజీ లభిస్తుంది. అలాగే రూ.80 లక్షల వరకు పాక్షిక అంగవైకల్యానికి కూడా కవరేజీ ఉంటుంది.
ఈ బీమా కవరేజీ రైల్వే ఉద్యోగులందరికీ ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ఉచితంగా లభిస్తుంది. అంటే, ఉద్యోగులు అదనపు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అదనంగా, రైల్వే శాఖ ఉద్యోగులకు ఎస్‌బీఐ రూపే డెబిట్ కార్డ్ ద్వారా రూ.1 కోటి వరకు అదనపు బీమా కవరేజీ కూడా లభిస్తుంది.
ఈ ప్రయోజనాలతో కలిపి రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1.60 కోట్ల వరకు ఎయిర్ యాక్సిడెంట్ డెత్ కవరేజీ, రూ.1 కోటి పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ, రూ.80 లక్షల వరకు పాక్షిక అంగవైకల్యం బీమా, అలాగే రూ.10 లక్షల వరకు సాధారణ మరణ కవరేజీ అందజేయబడుతుంది. ఈ ప్రయోజనాలు అన్ని గ్రూప్ A, B, C ఉద్యోగులకు వర్తిస్తాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉన్నారు. వారందరికీ ఈ ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. ఈ ఎంఓయూ వల్ల ఉద్యోగులకు అదనపు రక్షణ కలిగినట్లే కాకుండా, ప్రమాదాల సమయంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.