ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ తొలి దశ పనుల కోసం రూ.916 కోట్లు కేటాయించింది. విమానాశ్రయం నిర్మాణం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అంతర్జాతీయ టెండర్లను పిలిచారు. అక్టోబర్ 10న ప్రీబిడ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుండగా, నవంబర్ 3వ తేదీ బిడ్‌ల దాఖలు చివరి గడువుగా నిర్ణయించారు.
ఈ విమానాశ్రయం నెల్లూరుతో పాటు తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య వంటి జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక రంగం, పారిశ్రామిక రంగం విస్తరణకు ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొదటి దశలో రన్‌వే నిర్మాణం జరగనుంది. మొదట్లో ఎయిర్‌బస్ A-320/A-321 తరహా మీడియం సైజు విమానాలను నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల డిమాండ్ పెరిగేకొద్దీ మూడుఫేజ్‌లలో అభివృద్ధి చేస్తారని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని 45 ఏళ్ల రాయితీ ఒప్పందంతో నిర్మించనుంది. ప్రతి 15 ఏళ్లకు ఒక దశగా అభివృద్ధి చేసే ప్రణాళిక ఉంది. మొదటి దశలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుందని, రెండవ దశలో డిమాండ్ పెరుగుతుందని, మూడవ దశలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రణాళికలో కార్గో సదుపాయాలను కూడా పెంచే అవకాశం ఉంది.
దగదర్తి విమానాశ్రయం ప్రతిపాదన 2016లో టీడీపీ ప్రభుత్వం కాలంలోనే మొదలైంది. అప్పట్లో టర్బో కన్సార్షియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించగా, ఆ సంస్థ మధ్యలోనే ఒప్పందం నుంచి తప్పుకుంది. తరువాత తెట్టు విమానాశ్రయ ప్రాజెక్ట్‌ను పరిశీలించినా, గత ఐదేళ్లలో దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం విమానాశ్రయం కోసం దాదాపు 1,300 ఎకరాల భూమి సేకరించారు. ఇప్పటికే పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనుమతులు లభించాయి. అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు వచ్చాయి. రక్షణ, హోంశాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నెల్లూరు జిల్లా మాత్రమే కాకుండా మొత్తం దక్షిణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టనుంది.