విదేశాల్లో ఉన్నత విద్య అనగానే భారతీయ విద్యార్థులకు గుర్తొచ్చే ప్రధాన గమ్యస్థానం కెనడా. అయితే తాజాగా ఆ దేశం భారత విద్యార్థులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది సమర్పించిన స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో సుమారు 80 శాతం వరకు తిరస్కరించబడినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ (IRCC) నివేదికలో వెల్లడైంది. గత పదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వీసాలు తిరస్కరించబడటం ఇదే తొలిసారి.
దీంతో కెనడాలో చేరుతున్న భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2024లో కేవలం 1.88 లక్షల మంది భారతీయ విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా, రెండు సంవత్సరాల క్రితం కంటే ఈ సంఖ్య సగానికి పడిపోయింది. ఒకప్పుడు భారత విద్యార్థుల్లో 18 శాతం మంది కెనడాను ఎంచుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 9 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ పరిణామానికి కారణం కెనడా ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలే. దేశంలో గృహాల కొరత, మౌలిక వసతులపై ఒత్తిడి, రాజకీయ కారణాలతో వీసా నిబంధనలను కఠినతరం చేశారు. ఇప్పుడు విద్యార్థులు వీసా కోసం మరింత బలమైన ఆర్థిక పత్రాలు, స్పష్టమైన స్టడీ ప్లాన్‌లు, లాంగ్వేజ్ టెస్ట్ ఫలితాలు సమర్పించాల్సి వస్తోంది. కనీస ఆర్థిక అవసరం రెట్టింపై 20,000 కెనడియన్ డాలర్లకు పైగా పెరిగింది. అలాగే చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలను తగ్గించడం, వర్క్ పర్మిట్ నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు చేపట్టారు. వేగవంతమైన వీసా ప్రక్రియ కోసం అమలు చేసిన ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్’ విధానాన్ని కూడా నిలిపివేశారు.
కెనడా తలుపులు మూయడంతో భారత విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో జర్మనీ కొత్త గమ్యస్థానంగా మారింది. అప్‌గ్రాడ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం 31 శాతం భారత విద్యార్థులు జర్మనీలో చదవాలని ఆసక్తి చూపుతున్నారు. తక్కువ లేదా ఉచిత ఫీజులు, ఇంగ్లిష్‌లో కోర్సులు, బలమైన ఆర్థిక వ్యవస్థ, మెరుగైన ఉపాధి అవకాశాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. గత ఐదేళ్లలో జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య రెట్టింపు కాగా, ప్రస్తుతం అది దాదాపు 60,000 చేరిందని గణాంకాలు సూచిస్తున్నాయి.