ఆంధ్రప్రదేశ్‌లోని పత్తి రైతులకు ఈ సంవత్సరం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పత్తి కొనుగోలులో పారదర్శకత, సమయపాలన కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ‘కపాస్ కిసాన్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. రైతులు ఈ యాప్‌లో తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు, పంట విక్రయానికి ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త నియమాలపై రైతులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమకు దగ్గరలోని కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్మే అవకాశం లేకుండా పోవచ్చని అంటున్నారు. స్లాట్ బుకింగ్ ప్రకారం సీసీఐ ఎక్కడ చెప్తే అక్కడికే పత్తి తీసుకెళ్లాల్సి రావడం వల్ల రవాణా సమస్యలు, అదనపు ఖర్చులు తప్పవని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ విజయ సునీతతో పాటు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్త నిబంధనల అమలు, రైతులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించి కొన్ని సడలింపులపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న ఆల్ ఇండియా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైతే నిబంధనల్లో సడలింపులు ఇవ్వడాన్ని సీసీఐ పరిశీలిస్తుందని లలిత్ కుమార్ గుప్తా తెలిపారు.