ఇటీవల అల్పపీడనం ప్రభావం తగ్గడంతో వర్షాలు కొంత మేర తగ్గాయి. అయితే భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పూర్తిగా తగ్గిపోవడం లేదు. రాబోయే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, యానాంలో కూడా వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. అంతేకాకుండా కోస్తాంధ్రలో ఆగస్ట్ 25, 26 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, 26, 27 తేదీల్లో కర్ణాటక, కేరళలో కూడా భారీ వర్షాలు పడతాయని IMD స్పష్టం చేసింది.
శాటిలైట్ అంచనాల ప్రకారం తెలంగాణలో ఇవాళ ఎండ, మబ్బులు మారి మారి కనిపిస్తాయి. అప్పుడప్పుడూ వర్షం కురిసే పరిస్థితి ఏర్పడినట్లు కనిపించినా వర్షపాతం పెద్దగా ఉండదు. ఇటీవల పడిన వాన రైతులకు కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం పంటలకు నష్టం కలిగించింది. ప్రస్తుతానికి అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రశాంతంగా ఉన్నందున మరోసారి పెద్ద ఎత్తున వర్షాలు పడటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అక్కడ రోజంతా మేఘావృత వాతావరణం కనిపించే అవకాశం ఉంది. కోస్తా, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల మాత్రమే జల్లులు పడవచ్చు. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఇటీవల వర్షపాతం చాలా తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం తగిన వర్షాలు కురవడం వల్ల కొంత ఉపశమనం లభించింది.
ఇక గాలుల వేగం విషయానికి వస్తే, అరేబియా సముద్రంలో గంటకు 47 కిలోమీటర్ల వేగంతో, బంగాళాఖాతంలో గంటకు 39 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఏపీలో గంటకు 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ కారణంగా దీర్ఘ ప్రయాణాలకు ఇవాళ వాతావరణం అనుకూలంగా ఉంటుందని IMD సూచించింది. రోడ్లు పొడిగా ఉండడం వల్ల ప్రయాణం సులభమవుతుందని, అయితే కొన్ని చోట్ల మట్టి, ఇసుక ఉండే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజా వాతావరణ పరిస్థితులు చూస్తే, ఈ వర్షాలు ఇంకా వారం రోజులపాటు కొనసాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణ అరేబియా సముద్రంలో ఒక చిన్నపాటి ఆవర్తనం కనిపిస్తోంది. ఇది బలపడితే మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదనంగా అంటార్కిటికా నుంచి వచ్చే చల్లని గాలులు, మేఘాలు కూడా రాబోయే రెండు వారాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో నెలాఖరు నాటికి మళ్లీ చిన్న స్థాయిలోనైనా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.