కువైట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ ఇటీవల ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇది తీర్మానం సంఖ్య 19/2025గా ప్రకటించబడింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ యాక్సిడెంట్ బీమా (వాహన బీమా) తప్పించి మిగతా అన్ని తప్పనిసరి బీమా పాలసీలకు కొత్త నియమాలు అమలు అవుతాయి. దీని ప్రధాన ఉద్దేశ్యం బీమా రంగంలో పారదర్శకతను తీసుకురావడం, పాలసీదారుల హక్కులను రక్షించడం, అలాగే బీమా మార్కెట్ అభివృద్ధికి దోహదం చేయడం.
ఈ తీర్మానంలో బీమా కంపెనీలకు కొన్ని కొత్త బాధ్యతలు విధించారు. ప్రతి పాలసీలో డిక్లరేషన్ మరియు ప్లెడ్జ్ క్లాజ్ తప్పనిసరిగా ఉండాలి. అంటే, బీమా తీసుకున్న వారు పాలసీ నిబంధనలు, షరతులు, మినహాయింపులు మరియు కవరేజీ పరిమితులు పూర్తిగా తెలుసుకున్నారని స్పష్టంగా పేర్కొనాలి. అదనంగా, ప్రతి పాలసీ డాక్యుమెంట్‌పై ఒక QR కోడ్ ఇవ్వడం తప్పనిసరి చేశారు. ఈ కోడ్‌లో పాలసీకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. పాలసీ రద్దు అయితే దాని కారణం, కస్టమర్‌కు తిరిగి వచ్చే డబ్బు లెక్కింపు విధానం మరియు ప్రీమియం లెక్కింపు విధానం స్పష్టంగా అందులో ఉంటాయి.
ఈ కొత్త సిస్టమ్‌ను గెజిట్‌లో ప్రచురణ అయిన 180 రోజుల తర్వాత అమలులోకి తీసుకువస్తారు. అప్పటి వరకు బీమా కంపెనీలకు వారి సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అమలు తేదీ నుంచి అన్ని కంపెనీలు ఒకే విధమైన ప్రమాణాలను పాటించాలి. ఇకపై ప్రతి కంపెనీ తన ఇష్టానికి తగిన విధంగా ధరలు నిర్ణయించలేవు, ఎందుకంటే ప్రీమియం లెక్కింపు విధానం ఇప్పటికే స్పష్టంగా నిర్ణయించబడింది. దీని వల్ల కంపెనీలతో కస్టమర్ల మధ్య పారదర్శకత మరింత పెరుగుతుంది.
ఈ తీర్మానంలో సాంకేతిక భద్రత, సైబర్ సెక్యూరిటీ, పాలసీ వినియోగదారుల అవగాహన చర్యలు అన్నీ ప్రత్యేకంగా చేర్చబడ్డాయి. దీని ద్వారా మోసాలను అరికట్టడం, పాలసీల నిజమైన స్థితిని గుర్తించడం సులభమవుతుంది. ఈ కొత్త విధానం కేవలం పాలసీదారుల రక్షణకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ కువైట్‌లో బీమా రంగం మరింత నమ్మకంగా, సమర్థవంతంగా మారుతుందని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది.