భారత్-కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే గణనీయంగా దిగజారిన నేపథ్యంలో, ఖలిస్థానీ వేర్పాటువాదుల తాజా చర్య ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరింత బరితెగించి, తమ తలంపులను అమలు చేసే దిశగా ముందుకెళ్లారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో 'రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్ రాయబార కార్యాలయం' పేరుతో ఒక రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సర్వత్రా కలకలం రేపింది. భారత్‌కి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతున్నారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం కొంత ఆందోళన కలిగించే విషయమే.
ఈ కార్యాలయం ఏర్పాటైన స్థలం కూడా వివాదాస్పదమే. గతంలో హత్యకు గురైన, భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ నేతృత్వం వహించిన గురునానక్ సింగ్ గురుద్వారా ప్రాంగణంలోనే ఈ కార్యాలయం తెరచింది. ఇదే ఘటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంగణంలో ఖలిస్థాన్ కార్యాలయం ప్రారంభించడం ఖలిస్థానీ వేర్పాటువాదుల ధైర్యాన్ని, తెగింపును మరింత స్పష్టం చేస్తోంది. ఈ కార్యాలయానికి బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం నుంచి 1.5 లక్షల డాలర్ల నిధులు మంజూరయ్యాయన్న ఆరోపణలు ఈ వివాదాన్ని మరో మెట్టు ఎక్కిస్తున్నాయి.
ఈ ఘటనపై భారత్ కెనడాను తీవ్రంగా తప్పుబట్టింది. ఒట్టావాలోని భారత హైకమిషన్ – ఇది దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భీకర ముప్పుగా అభివర్ణిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదుల తీరును ఖండించిన భారత్, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయినప్పటికీ, ఇప్పటివరకు కెనడా కేంద్ర ప్రభుత్వం లేదా బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఏబీ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కెనడాలో ఖలిస్థానీ శక్తులు ఈ స్థాయిలో స్వేచ్ఛగా వ్యవహరించడంలో అక్కడి ఓటు బ్యాంకు రాజకీయాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో సిక్కుల సంఖ్య 7.7 లక్షలకుపైగా ఉండటంతో, రాజకీయ పార్టీలు వారి మద్దతును కోల్పోవాలనుకోవడం లేదు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వేర్పాటువాద చర్యలకు అవకాశం కల్పించడాన్ని భారత్ ఎన్నోసార్లు విమర్శించింది. కెనడా నుంచే భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లు నడుస్తున్నాయన్న ఆధారాలను సమర్పించినప్పటికీ... అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్నది భారత్ దౌత్య వర్గాల ఆందోళన.