హిందూ ధర్మశాస్త్రంలో తులసి మొక్క అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ మొక్క కొమ్మలలో బ్రహ్మదేవుడు నివసిస్తాడని, తీర్థయాత్రల ప్రాముఖ్యత దానివేళల్లో తాలూకు పవిత్రతతో కలిసిపోయినదని పురాణాలు చెబుతున్నాయి. తులసి ఆకుల్లో దేవతలు నివసిస్తారని, గంగా నది దాని వేళల్లో ప్రవహిస్తుందని విశ్వసించబడుతుంది. అంతటి పవిత్రత కలిగిన తులసి మాతకు హిందూ ఇళ్లలోనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా విశేష స్థానం ఉంది.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తులసి మహత్యానికి సంబంధించిన విశిష్ట ఉత్సవాన్ని ఆగస్టు 6న నిర్వహించనుంది. ఈ ఉత్సవాన్ని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు తులసి ఆవిర్భావం జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు గోవిందరాజ స్వామి గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తర్వాత బంగారు వాకిలి చెంత స్వామివారి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా అర్చకులు తులసి మహత్యాన్ని వివరించే పురాణ పఠనాన్ని చేస్తారు. తులసి మాత గొప్పతనాన్ని భక్తులకు వివరిస్తూ, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవం ద్వారా తిరుమలలో భక్తులందరికి తులసి మాత విశిష్టతను తెలియజేయడం లక్ష్యంగా ఉంది.
శ్రావణ మాసంలో శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన తులసి మాతకు అంకితంగా జరగనున్న ఈ మహోత్సవం భక్తుల మన్ననలు పొందనుంది. గోవిందరాజస్వామి ఆలయంలో ఇప్పటికే కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమలలో శ్రద్ధాభక్తులతో జరుగనున్న ఈ ఉత్సవం హిందూ సంప్రదాయానికి గొప్ప మారు చిరునామాగా నిలవనుంది.