తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 51,451 మంది ఉద్యోగుల సేవలను ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చిలో వారి కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ, గత మూడు నెలలుగా వారి సేవలు కొనసాగించే విషయంలో స్పష్టత లేకుండా ఉండింది.
తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని, వారి ఉద్యోగ కాలాన్ని 2026 మార్చి వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. దీనితో వేలాది మంది ఉద్యోగులు ఊరట చేకూరింది. అలాగే, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-అభిమ్) కింద పనిచేస్తున్న 1,500 మంది ఉద్యోగుల సేవలను కూడా మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంకా NHM కింద వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో పని చేస్తున్న మరో 1,760 మంది ఉద్యోగుల సేవలను కూడా ప్రభుత్వం కొనసాగించనుంది. ఈ నిర్ణయంతో ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.