ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు A-4గా ఉన్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (Rajampet MP Mithun Reddy) కి కోర్టు రిమాండ్ (Remand) విధించింది. విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు ఆయనను ఆగస్టు 1 వరకు న్యాయహిరాసతలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా పోలీసులు మిథున్‌రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం మిథున్‌రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సిట్ అధికారులు మద్యం స్కామ్‌లో కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా మిథున్ రెడ్డిని విచారించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై పాలసీ రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధంగా మద్యం లైసెన్స్‌లు ఇచ్చేందుకు ప్రభావితం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు (High Court), సుప్రీంకోర్టు (Supreme Court)ల్లో కొట్టివేయబడిన నేపథ్యంలో శనివారం సిట్ అధికారులు మిథున్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.