
సొరకాయ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దానిలోని నీటి శాతం. ఇది చాలా తేలికైన, ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. కానీ, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు ఇది అంత మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఇది హానికరం కూడా కావచ్చు. ఇంతకీ దీన్ని ఎవరు తినకూడదు? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
ఈ సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్త!
గర్భిణులు: అధ్యయనాల ప్రకారం, సొరకాయను ఎక్కువగా తినడం వల్ల గర్భిణులకు, పుట్టబోయే బిడ్డకు కొన్ని సమస్యలు వస్తాయట. సొరకాయలో ఉండే కొన్ని రకాల టాక్సిన్స్ బేబీ ఎదుగుదలపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. అందుకే, ప్రెగ్నెంట్ ఉమెన్ సొరకాయ తినే ముందు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
లో బీపీ సమస్య ఉన్నవాళ్లు: సొరకాయ తింటే బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. అందుకే, లో బీపీ సమస్య ఉన్నవారు దీన్ని ఎక్కువగా తినడం తగ్గించుకోవాలి. ఎక్కువగా తింటే తల నొప్పి, బలహీనత, కళ్లు తిరగడం లాంటి సమస్యలు రావచ్చు.
కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్లు: కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్లు కూడా సొరకాయకు దూరంగా ఉండాలి. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కిడ్నీలు ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. బాడీలో పొటాషియం లెవెల్స్ పెరిగితే కిడ్నీలపై మరింత ఒత్తిడి పడి, వాటి పనితీరు తగ్గిపోతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు: గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తితో ఇబ్బంది పడేవాళ్లు సొరకాయను తక్కువగా తినడం లేదా రాత్రి పూట పూర్తిగా మానేయడం బెటర్. ఇందులో ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ జీర్ణక్రియను స్లో చేస్తుంది. అందుకే, జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకు ఇది అస్సలు మంచిది కాదు.
సొరకాయతో జాగ్రత్తలు:
జ్యూస్‌తో జాగ్రత్త: సొరకాయను మనం ఎక్కువగా కూరగా లేదా జ్యూస్ రూపంలో తింటాం. సొరకాయ జ్యూస్ వల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసు. కానీ, జ్యూస్ చేయడానికి ముందు అది చేదుగా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. చేదుగా ఉండే సొరకాయ జ్యూస్ తాగడం చాలా ప్రమాదకరం. దీనివల్ల కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, పైత్యం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ లేదా ఫుడ్ పాయిజనింగ్ కూడా రావచ్చు. అందుకే, తాజాగా ఇంట్లో తయారు చేసుకున్న జ్యూస్‌ను మాత్రమే తీసుకోవడం మంచిది.
చేదుగా ఉంటే ప్రమాదం: సొరకాయను ఎంచుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు చేదుగా ఉండే సొరకాయలు మనకు కనిపిస్తుంటాయి. అవి చాలా ప్రమాదకరం. దాంట్లో కక్యూర్‌బిటాసిన్ అనే టాక్సిక్ కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల వాంతులు, డయేరియా, తీవ్రమైన కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సొరకాయను కూర చేసే ముందు ఒక చిన్న ముక్కను టేస్ట్ చేయడం మంచిది.
సొరకాయ ఒక మంచి కూరగాయ అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నవాళ్లు దీన్ని తిని లాభాలు పొందవచ్చు. కానీ, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, సొరకాయను మీ డైట్‌లో చేర్చుకునే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.