ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్ వచ్చింది. పాత వాహనాలపై అమలు చేస్తున్న గ్రీన్ ట్యాక్స్ (హరిత పన్ను)ను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా లారీలు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలకు ఏడు సంవత్సరాలు పూర్తయ్యాక ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలంటే గ్రీన్ ట్యాక్స్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఈ పన్ను కనిష్టంగా రూ.800 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పన్నుతో ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి చేరుతోంది. 2022–23లోనే గ్రీన్ ట్యాక్స్ ద్వారా రూ.89.96 కోట్లు, 2023–24లో రూ.102.94 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అయినప్పటికీ పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో గ్రీన్ ట్యాక్స్ అధికంగా ఉందని లారీ యజమానులు, వాహనదారులు వాపోతున్నారు.
వాహనదారుల ఈ సమస్యను గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్‌లకు యజమానులు వివరించారు. అధిక పన్నుతో తమపై భారం పడుతోందని, ఇది తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో టీడీపీ–జనసేన కూటమి అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆర్డినెన్స్ ద్వారా పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనికి చట్టబద్ధత కల్పించేందుకు మోటార్ వాహనాల ట్యాక్సేషన్ చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ బిల్లును సభలో ఉంచగా, అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు చట్టరూపం దాల్చితే వాహనదారులకు నేరుగా భారీ ఊరట లభిస్తుంది. ఇప్పటి వరకు పాత వాహనాలపై వసూలు చేసిన గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల వరకు ఉండగా, ఇకపై గరిష్టంగా రూ.3 వేలకే పరిమితం కానుంది. అంటే పన్ను తగ్గింపు భారం వాహనదారుల జేబుకు నేరుగా ఉపశమనం అందించనుంది. ఇకపై ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందే సమయంలో తక్కువ మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో పాత లారీలు, బస్సులు, ఇతర వాహనాల యజమానులకు నేరుగా ప్రయోజనం కలగనుంది.
ఏపీలో గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ డిమాండ్ నెరవేరిందని, ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆదాయం తగ్గినా, ప్రజలకు భారం తగ్గించడం ముఖ్యమని చెబుతోంది. పన్ను తగ్గింపుతో వాహనదారులకు ఊరట కలిగించడం ద్వారా రవాణా రంగం మరింత చురుకుదనం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద ఈ నిర్ణయం వాహనదారులకు గుడ్ న్యూస్‌గా మారింది.