ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గట్టి దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రద్దీ అధికంగా ఉన్న రహదారులను హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని ముఖ్య రహదారులను ఎంపిక చేశారు.
హ్యామ్ విధానం ప్రకారం రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40% ప్రభుత్వమే నేరుగా ఖర్చు చేస్తుంది. మిగిలిన 60% నిధులను కాంట్రాక్టర్ బ్యాంకు రుణంగా పొందుతాడు. నిర్మాణం అనంతరం రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్లలో విడతల వారీగా తిరిగి చెల్లిస్తుంది. అదే సమయంలో, కాంట్రాక్టర్ వారే రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా చేపడతారు. ఇప్పటికే బైరాజుకండ్రిగ-రామాపురం, నాగలాపురం-చిన్నపాండూరు వంటి ప్రధాన రహదారుల అభివృద్ధికి కోట్లల్లో నిధులు ప్రతిపాదించబడ్డాయి. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపగానే పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ విధానంతో చిత్తూరు జిల్లాలో రహదారుల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. వాహనదారులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాక, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకం కానుంది.