రాజధానిలో పనులు నిలిచిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నవారు స్వయంగా వచ్చి వాస్తవ పరిస్థితులు చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. అమరావతిలో జరుగుతున్న పలు కాలువల అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల వర్షాల కారణంగా కొంతమేర పనులకు ఆటంకం కలిగిందని ఆయన వెల్లడించారు.
“ఎంతటి కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా… మూడేళ్లలో అమరావతి తొలి దశ పనులను పూర్తి చేసి చూపిస్తాం” అని మంత్రి ధృవీకరించారు. సింగపూర్‌లో అమలు చేస్తున్న అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రమాణాలను అమరావతిలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు.
రివర్‌ఫ్రంట్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్న నారాయణ, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే రాజధాని రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.