రాజకీయ నాయకులు ప్రజల ముందు మాట్లాడే భాషలో హుందాతనం, సంస్కారం ఉండాలి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన, రాజకీయ పరిణితి, నైతిక విలువలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రస్తుత కాలంలో కొంతమంది నాయకులు, సోషల్ మీడియాలోనూ, సభల్లోనూ అవమానకరమైన, అసభ్య భాష వాడుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు బూతులు మాట్లాడటం ఒక ట్రెండ్ అయిపోయినట్టుంది. ఇది మంచి లక్షణం కాదు. రాజకీయాల్లో ప్రజల సేవ ముఖ్యం, వ్యక్తిగత దూషణలు అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు.
వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu) తన అనుభవాలను ఉదాహరణగా చెబుతూ, ‘‘గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన నేతలు ఎప్పుడూ ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయారు. చివరకు ఓటమి పాలయ్యారు. దీన్ని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు. రాజకీయ నాయకులు మాటలపై నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు.
‘‘ఒక నాయకుడు మాట్లాడే ప్రతి మాట ప్రజల మనసుల్లోకి చేరుతుంది. అది మంచి మాటైనా, చెడు మాటైనా ప్రభావం పడుతుంది. అందుకే ప్రతి నాయకుడు తన మాటలు ఆలోచించి మాట్లాడాలి. అవసరమైతే ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.
ఇప్పటి యువతకు కూడా ఇదే సందేశం ఇచ్చారు. పనితీరు, ప్రజాసేవే కాదు... మాటతీరు కూడా ఓ నాయకుడి గొప్పతనానికి అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం, కానీ అవి వ్యక్తీకరించేటప్పుడు పరిమితుల్ని మరిచిపోవద్దని హితవు పలికారు.