భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా చేనేతలు నిలిచారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, చేనేత కార్మికులకు ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలపై వివరించారు.
"నైపుణ్యం, కళాత్మకత కలిసిన రూపమే చేనేతలు. వ్యవసాయానంతరం అత్యధిక ఉపాధి కల్పించే రంగం వస్త్ర పరిశ్రమే. టీడీపీకి చేనేతలతో విడదీయరాని బంధం ఉంది. నేతన్నలకు తొలి ప్రోత్సాహం ఇచ్చింది ఎన్టీఆర్ గారే," అని చంద్రబాబు అన్నారు.
చేనేతల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టిన పలు కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వెల్లడించారు:
55,500 చేనేత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.27 కోట్లు రుణంగా మంజూరు.
90,765 కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా.
మరమగ్గాల కోసం రూ.80 కోట్లు ఖర్చు, 50% సబ్సిడీతో సహాయపడి మరి.
చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ ప్రారంభం – చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్న సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం.
ఉచిత విద్యుత్ పథకం వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి.
"చేనేతలకు ఎంత సహాయం చేసినా తక్కువే, వాళ్ల శ్రమతో భారత సంప్రదాయ వస్త్రాలకు ప్రాణం వస్తుంది" అని అన్నారు. ఈ వేడుకలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.