ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం నేడు అధికారికంగా ప్రారంభమవుతోంది. ఈ పథకం కింద మహిళలు, యువతులు, థర్డ్ జెండర్ ప్రయాణికులు రాష్ట్రంలోని ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభమైన వెంటనే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది. పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధికారులతో సమీక్ష నిర్వహించి, మహిళా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఫిర్యాదులు రాకుండా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
పథకం అమలుతో డ్రైవర్లు, కండక్టర్లకు అదనపు పనిభారం పెరగనుంది. అందువల్ల డబుల్ డ్యూటీ భత్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రెగ్యులర్ డ్రైవర్లకు రూ.800, కండక్టర్లకు రూ.700 ఇచ్చేవారు. ఇకపై డ్రైవర్లకు రూ.1,000, కండక్టర్లకు రూ.900 చెల్లించనున్నారు. అలాగే ఆన్‌కాల్ డ్రైవర్లకు రోజుకు రూ.800 నుంచి రూ.1,000కు పెంచారు.
ఉచిత ప్రయాణం అందుబాటులో ఉన్న బస్సులను సులభంగా గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆకుపచ్చ రంగులో ఉండే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు పథకం కింద ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఒకేలా కనిపించినా, ఈ పథకం ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. కన్ఫ్యూజన్ నివారించేందుకు "స్త్రీ శక్తి పథకం వర్తిస్తుంది" అని స్పష్టంగా రాసిన స్టిక్కర్లను బస్సులపై అంటిస్తున్నారు.
ఈ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ఏటా రూ.1,942 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన మొత్తం 8,458 బస్సుల్లో 74 శాతం బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మహిళలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.