ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు అతలాకుతలంగా కురుస్తున్నాయి. నిన్నటి నుండి పలు జిల్లాలు భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఈ ప్రభావం అమరావతి రాజధాని పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నగరానికి బుడమేరు ముప్పు ఉందన్న చర్చల మధ్య, అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు.
ఈ రోజు, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రజలకు కీలక సూచనలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్‌లో బుడమేరు వంతెనను, 58వ డివిజన్‌లోని ఇందిరా నాయక్ నగర్, భరతమాత గుడి రోడ్డులోని బుడమేరు కాలువను ఆయన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి పరిశీలించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, గతేడాది భారీ వర్షాలకు బుడమేరు వాగు పొంగిపొర్లి నగరాన్ని వరద ముంచెత్తిందని గుర్తుచేశారు. వాగుకి గండ్లు పడిన ప్రదేశాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించామని చెప్పారు. ప్రస్తుతం కృష్ణా నది నుంచి 3,80,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా, బుడమేరు వాగు పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు.
వచ్చే వర్షాకాలానికి బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితులు తప్ప, విజయవాడ ప్రజలు ఇళ్ల బయటకు రావొద్దని సూచించారు.