అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మోంటానా రాష్ట్రంలోని అనకొండ నగరంలో ఒక బార్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం అనకొండ నగరంలోని 'ది అవుల్ బార్' లో ఈ దారుణం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు మైఖేల్ పాల్ బ్రౌన్‌గా గుర్తించారు. నిందితుడి ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేసిన పోలీసులు, అతను ప్రమాదకరమైన ఆయుధంతో తిరుగుతున్నాడని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుడు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
ఈ ఘటనతో అనకొండ పశ్చిమ ప్రాంతంలోని స్టంప్‌టౌన్ రోడ్, అండర్సన్ రాంచ్ లూప్ రోడ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాల్పుల వార్త తెలియగానే అనకొండ పట్టణ వాసులు భయంతో వణికిపోయారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి, కస్టమర్లతో పాటు లోపలే ఉండిపోయారు. "మా పట్టణంలో లాక్‌డౌన్ తరహా వాతావరణం నెలకొనడంతో అందరూ ఆందోళనలో ఉన్నారు" అని స్థానిక కేఫ్ యజమాని ఒకరు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ నర్సరీ స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకుంది. నిందితుడు ఇంకా దొరకకపోవడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.