ప్రస్తుత కాలంలో విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నదే ఆశయం. అయితే ప్రభుత్వం ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నప్పటికీ ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే తపనతో, తల్లిదండ్రులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే దుర్వినియోగం చేస్తూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఇటీవల నర్సరీ విద్య కోసం వసూలు చేస్తున్న ఫీజుల రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @talk2anuradha అనే యూజర్ షేర్ చేసిన స్కూల్ ఫీజు రిసీప్ట్ ప్రకారం, నర్సరీ తరగతి చదవాలంటే ఏకంగా రూ. 2,51,000, ఎల్‌కేజీ, యూకేజీలకు రూ. 2,72,400, 1వ తరగతికి రూ. 2,91,460 వరకు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు సగటున రూ. 21,000 పైగా ఖర్చవుతుంది. “ఏబీసీడీలు నేర్చుకోవడానికి ఇంత ఖర్చా? పిల్లల విద్య పేరుతో స్కూళ్లు ఈ స్థాయిలో దోపిడి చేస్తుంటే ప్రభుత్వ నియంత్రణ ఎక్కడ?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.