ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలను తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మద్యం అమ్మకాల సమయంలో ప్లాస్టిక్ బాటిళ్లపై డిపాజిట్ రీఫండ్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, మద్యం కొనుగోలు సమయంలో ప్రతి ప్లాస్టిక్ బాటిల్‌పై అదనంగా రూ.20 డిపాజిట్‌గా వసూలు చేస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాటిల్‌ను లేబుల్ లేదా స్టిక్కర్‌తో సహా తిరిగి అదే Bevco outlet వద్దకు తీసుకెళితే ఆ డిపాజిట్‌ను తిరిగి ఇస్తారు. దీని ద్వారా ప్రజలు ఖాళీ బాటిళ్లను పారేసే విషయంలో జాగ్రత్త వహించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములవుతారు.
ఈ ప్రణాళికను క్లీన్ కేరళ కంపెనీ సహకారంతో సెప్టెంబరులో తిరువనంతపురంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ విధానం ఇప్పటికే తమిళనాడులో విజయవంతంగా అమలైందనీ, అదే తరహాలో కేరళలో కూడా ప్రయోగించాలని నిర్ణయించారు. కేరళ ఎక్సైజ్ శాఖ, స్వచ్ఛ మిషన్, బెవ్కో అధికారులు కలిసి ముందస్తుగా అధ్యయనం చేసి ఈ విధానాన్ని రూపొందించారు. ఇదే సమయంలో రూ.900 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యం విక్రయించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా Premium outlet లు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 5న త్రిస్సూర్‌లో మొదటి అవుట్లెట్ ప్రారంభంకానుండగా, మరిన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న వేటింగ్ సమస్యలకూ పరిష్కారంగా ఉండనుంది.