ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘అన్నదాత సుఖీభవ పథకం 2025’ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించినది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభించనున్నారు. మొదటి విడతలో రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 46.85 లక్షల మంది రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం రూ.831.51 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు విడుదల చేయనుంది.
అయితే, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో, ఆ ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధుల జమను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, కారంపూడి, విడవలూరు, రామకుప్పం మండలాలు, కొండపి, కడియపులంక గ్రామ పంచాయతీలు వంటి చోట్ల ఈ ఆదేశాలు అమలవుతాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు.
అయితే, ఇప్పటికే కొనసాగుతున్న పీఎం కిసాన్ పథకం నిధులను మాత్రం విడుదల చేయచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇందులో రాజకీయ నాయకులు పాల్గొనరాదు, రాజకీయ ప్రచారాలు చేయకూడదని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ జిల్లాల్లోని రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకంలోని బకాయి నిధులు విడుదల చేయనున్నారు.
ఈ పథకానికి అర్హులైన రైతుల వివరాలు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే వారు టోల్ ఫ్రీ నంబర్ 155251 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ లక్ష్యం – ప్రతి అర్హ రైతుకు న్యాయమైన ఆర్థిక మద్దతు అందించడం. ఇది రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి దోహదపడనుంది.