రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. బడికి దూరంగా ఉన్న విద్యార్థులకు రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం నూతన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు.
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 79,860 మంది విద్యార్థులకు మొత్తం రూ.47.91 కోట్లు రవాణా భత్యంగా ప్రభుత్వం చెల్లించనుంది.
రవాణా భత్యం లభించేందుకు క్రింది అర్హతలు అవసరం:
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు – ఇంటి నుంచి పాఠశాల దూరం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండాలి.
ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు – 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ.
సెకండరీ పాఠశాల విద్యార్థులు – 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ.
దూరాన్ని బట్టి నెలకు రూ.600 చొప్పున, ఒక్క విద్యార్థికి ఏడాదికి రూ.6,000 వరకు ప్రభుత్వం అందించనుంది. అయితే ఈ భత్యం పొందాలంటే విద్యార్థులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించడమే తప్పనిసరి. రవాణా భత్యం మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది ప్రభుత్వం.