తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ప్రసిద్ధి గల వేళాంకణి మేరీమాత ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సదరన్ రైల్వే ఈ ఏడాది కూడా రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. 09093 నంబర్ స్పెషల్ ట్రెయిన్ ఆగస్టు 27, సెప్టెంబర్ 6 తేదీలలో రాత్రి 8:40కి బాంద్రా టెర్మినస్ (ముంబయి) నుంచి బయలుదేరి, రెండో రోజు ఉదయం 7:40కి వేళాంకణి కి చేరుతుంది. తిరుగు ప్రయాణమైన 09094 నంబర్ రైలు ఆగస్టు 30, సెప్టెంబర్ 9 తేదీలలో అర్ధరాత్రి 12:30కి వేళాంకణి నుంచి బయలుదేరి, రెండో రోజు ఉదయం 10:30కి బాంద్రా టెర్మినల్ కి చేరుతుంది.
ఈ రైలు కడప, రేణిగుంట, గుత్తి, గుంతకల్, మంత్రాలయం, రాయచూర్, షోలాపూర్, పుణే, తిరువణ్ణామలై, నాగపట్నం వంటి కీలక స్టేషన్ల మీదుగా వెళ్తుంది. అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. వేళాంకణి వెళ్లే భక్తులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.