అమెరికా వలస విధానాల్లో మళ్లీ కఠినతరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిజినెస్ మరియు టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం సెక్యూరిటీ బాండ్ విధానం తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగశాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రోగ్రామ్‌గా ఒక సంవత్సరం పాటు ఈ నిబంధన అమలులో ఉండనుంది. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై దరఖాస్తు చేసుకునే వారు $5,000, $10,000 లేదా $15,000 వరకు బాండ్ చెల్లించవలసి ఉంటుంది.
ఈ బాండ్ మొత్తాన్ని వీసా దరఖాస్తు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్ళిన వారికి ఈ బాండ్ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. కానీ, వీసా నిబంధనలు ఉల్లంఘించినా లేదా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోయినా ఆ మొత్తాన్ని రీఫండ్ చేయరు. అయితే ఈ నిబంధన ప్రతి దేశానికి వర్తించదు. వీసా వేవర్ ప్రోగ్రాం కింద ఉన్న 42 దేశాలకు ఈ బాండ్ అవసరం ఉండదని వెల్లడించారు. ఈ జాబితాలో ప్రధానంగా ఐరోపా దేశాలు ఉంటాయి.
ఈ విధానం ట్రంప్ ప్రభుత్వం గతంలో 2020లోనూ ప్రకటించినా, కోవిడ్ వల్ల ప్రయాణాలు నిలిచిపోవడంతో ఆ సమయంలో పూర్తిగా అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి అదే విధానాన్ని కొనసాగించాలని అమెరికా యంత్రాంగం భావిస్తోంది. వీసా గడువు ముగిసిన తర్వాత కొందరు అమెరికా వదలకపోవడం, దేశ భద్రతకు ముప్పు ఏర్పడటం వంటి కారణాలే ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి.ఇలాంటి ఆంక్షలు వలసదారులపై మరింత ఒత్తిడిని తేవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.