ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దిశలో అడుగులు వేస్తోంది. పర్యాటకాలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా 'క్యారవాన్ టూరిజం' ను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ టూరిజం విధానం ద్వారా ప్రకృతి అందాలు, అడవులు, కొండలు, లోయలు ఉన్న ప్రాంతాల్లో బస్సుల ద్వారా ప్రయాణిస్తూ అక్కడే క్యాంప్ చేసే అవకాశం కలిగించనున్నారు.
ప్రస్తుతం రెండు క్యారవాన్ బస్సులు (Caravan buses ) సిద్ధమయ్యాయి. వీటిని ప్రారంభ దశలో అరకు లోయ పరిసర ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లోని ఐదు ప్రత్యేక ప్రదేశాలను అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. టూరిస్టులు అక్కడే కొన్ని రోజులు గడిపేలా క్యాంప్‌ఫైర్, ఆట స్థలాలు, విశ్రాంతి గదులు వంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ టూరిజం విధానంతో అరకు ప్రాంతానికి పర్యాటకుల రాక పెరుగుతుందని, దాని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యారవాన్ బస్సులు పూర్తి సౌకర్యాలతో కూడిన మొబైల్ హోటళ్లలా ఉంటాయి. దీని ద్వారా కుటుంబాలు, స్నేహితుల సమూహాలు ప్రకృతిని ఆస్వాదించుతూ సురక్షితంగా ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం నూతన పర్యాటక విధానానికి సంబంధించిన ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఆమోదం ఇచ్చిన వెంటనే క్యారవాన్ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం పర్యాటక రంగాన్ని నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.