రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా 6,238 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) పోస్టులు 183 కాగా, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు 6,055 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 28, 2025న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఆగస్టు 7, 2025. అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తులో తప్పులు సరిచేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్‌తో 10వ తరగతి లేదా 12వ తరగతి (PCM సబ్జెక్టులతో) పాస్ అయి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) పోస్టులకు BE/B.Tech, డిప్లొమా లేదా B.Sc డిగ్రీలు అర్హతగా పరిగణించబడతాయి. వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-30 సంవత్సరాలు, గ్రేడ్-I పోస్టులకు 18-33 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. జీతభత్యాల్లో, గ్రేడ్-I సిగ్నల్ ఉద్యోగులకు నెలకు రూ. 29,200 కాగా, గ్రేడ్-III ఉద్యోగులకు రూ. 19,900 లభిస్తుంది.
దరఖాస్తు రుసుము విషయంలో జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/పిహెచ్/మహిళా అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించవచ్చు. రైల్వేలో కెరీర్‌ను ఆశిస్తున్న యువతీ యువకులు, ఈ అవకాశాన్ని వదులుకోకుండా ముందే అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.