సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంపై మబ్బులు కమ్ముకొని జల్లులు ప్రారంభమయ్యాయి. ఈ వర్షం కొంత ఊరటనిస్తుందో ఏమో అనుకుంటూ ఉంటే… గచ్చిబౌలిలో ఒకసారిగా పిడుగు పడటంతో ప్రజలు హడలిపోయారు.
వివరాల్లోకి వెళితే— గచ్చిబౌలి ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద వర్షం మద్య ఓ తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. చెట్టుకు ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు ప్రాంతమంతా ఒక్కసారిగా వెలుగులతో మెరిసిపోవడం, ఉరుములతో కూడిన శబ్దాలు విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్లిన వాహనదారులు, నివాసితులు తేరుకోలేకపోయారు. కొందరు భయంతో పరుగులు తీశారు.
పిడుగుపాటు తీవ్రతకు తాటిచెట్టు పైభాగం అగ్నికి ఆహుతి అయ్యింది. వర్షం పడుతున్న వేళ కావడంతో జనసంచారం తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదొక అద్భుతమైన ఊరటగా నిలిచింది.
ఇంతటి అపాయ సంఘటన నగర నడిబొడ్డున చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.