తెలంగాణలో గృహ సమస్య తీవ్రత మరోసారి బయటపడింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో, పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరక అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ గృహ పథకాలపైనే ఆధారపడి జీవిస్తున్న ఈ కుటుంబాలకు తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ప్రజాపాలన కార్యక్రమంలో నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసింది. ఈ సర్వేకు భారీ స్పందన లభించగా, మొత్తం 77 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అందరికీ ఒకేసారి ఇళ్లు ఇవ్వడం సాధ్యం కాదన్న కారణంతో, అవసరాన్ని బట్టి దరఖాస్తుదారులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 అనే మూడు వర్గాలుగా విభజించారు.
సొంత స్థలం ఉన్నప్పటికీ నివసించడానికి ఇల్లు లేని పేద కుటుంబాలు ఎల్–1 జాబితాలోకి వచ్చాయి. ఈ వర్గంలో 23.20 లక్షల మంది ఉండగా, వచ్చే రెండేళ్లలో కేవలం 13.50 లక్షల మందికే ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన సుమారు 9.70 లక్షల మందికి తరువాతి దశల్లో అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
సొంత స్థలం కూడా లేని కుటుంబాలు ఎల్–2 జాబితాలోకి చేరాయి. ఈ వర్గంలో 21 లక్షలకుపైగా మంది ఉండటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. వీరికి ఇళ్లు ఇవ్వాలంటే ముందుగా స్థలం కేటాయించాలి, ఒక్కో ఇంటికి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అందువల్ల సమూహ గృహాల నిర్మాణం లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
దారిద్య్రరేఖకు పైబడి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించే వారు ఎల్–3 జాబితాలోకి వెళ్లారు. సుమారు 30 లక్షల మందిని అనర్హులుగా గుర్తించడంతో వారికి ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పారదర్శకంగా, నిజంగా ఇల్లు అవసరమైన పేదలకు మాత్రమే లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.