విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణను మలేసియా రాజధాని కౌలాలంపుర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 80 వేల మంది అభిమానులు హాజరుకావడం విశేషం. ఇది మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అత్యధిక జనసమూహంతో జరిగిన ఆడియో లాంచ్‌గా నమోదైంది. జననాయగన్’ విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ తరుణంలో విజయ్ అభిమానుల ప్రేమ ఒక్కసారిగా ఆందోళనగా మారిన ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. మలేసియాలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘జననాయగన్’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం విజయ్ చెన్నైకి తిరిగివచ్చారు. ఆయన రాక సమాచారం ముందుగానే బయటకు రావడంతో, విజయ్‌ను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలనే ఆశతో భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. టెర్మినల్ పరిసరాలు అభిమానులతో నిండిపోయి, పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.
విజయ్ బయటకు వచ్చిన వెంటనే అభిమానుల నుంచి జయజయధ్వానాలు మార్మోగాయి. భద్రతా సిబ్బంది, పోలీసులు ముందే ఏర్పాట్లు చేసినప్పటికీ, కొందరు అభిమానులు ఆ ఉత్సాహంలో నియంత్రణ కోల్పోయారు. కారు వైపు నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా అభిమానుల గుంపు ముందుకు రావడంతో విజయ్ తడబడి కింద పడిపోయారు. ఈ ఘటన అక్కడున్న వారిని క్షణకాలం షాక్‌కు గురి చేసింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి వెంటనే విజయ్‌ను లేపి, చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసి సురక్షితంగా కారులోకి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ విజయ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రముఖుల భద్రత ఎంత కీలకమో కూడా గుర్తు చేసింది. ఇలాంటి ఘటన ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అభిమానుల అత్యుత్సాహం కారణంగా పలువురు ప్రముఖ నటీనటులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇటీవల నిధి అగర్వాల్ ది రాజా సాబ్ కార్యక్రమం సందర్భంగా అభిమానుల గుంపులో ఇరుక్కొని అసౌకర్యానికి గురైన ఘటన చర్చనీయాంశమైంది. అలాగే స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది అభిమానుల హడావుడి కారణంగా ఇలాంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో అధికమవుతున్నాయి. అభిమానుల ప్రేమను చూపిస్తున్నప్పటికీ, క్రమశిక్షణ పాటించడమే నిజమైన అభిమాన లక్షణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.