పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. న్యూ ఇయర్ కానుకగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ పోస్టర్‌ను విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానుల్లో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్‌లో ప్రభాస్ కనిపించడం ఈ ఫస్ట్ లుక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పోస్టర్‌లో షర్ట్ లేకుండా, జులపాల జుట్టుతో, శరీరంపై గాయాల గుర్తులతో ప్రభాస్ నిలబడి ఉన్న తీరు సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. చేతిలో మద్యం బాటిల్, నోటిలో సిగార్‌తో కనిపించిన ఈ లుక్ పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్లుగా ఉంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది ఒక నెవ్వర్ బిఫోర్ అవతారం అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ వేల షేర్స్‌తో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాపై అంచనాలు మొదటినుంచే భారీగానే ఉన్నాయి. కారణం సందీప్ రెడ్డి వంగా గతంలో తీసిన చిత్రాలు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే స్టైల్‌ను ప్రభాస్ లాంటి స్టార్‌తో కలిపి చూపించబోతున్నారనే వార్తలే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. స్పిరిట్ టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై ప్రత్యేకమైన బజ్ కొనసాగుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. అయితే కేవలం యూనిఫామ్‌లో మాత్రమే కాదు, పాత్రలోని లోతును చూపించేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో ఆయన వెనక్కి తిరిగి నిలబడటం, ఎదురుగా హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఉండటం సినిమాకు సంబంధించిన కథలో కీలక మలుపులు ఉంటాయనే సంకేతాలను ఇస్తోంది. త్రిప్తి దిమ్రి పాత్ర కూడా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో బలమైన పాత్రగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు టాక్.
స్పిరిట్ మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. 2025 నవంబర్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం కీలక షెడ్యూల్స్‌లో ఉన్నట్లు సమాచారం. దర్శకుడు ఎలాంటి రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే సినిమాను 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్‌తో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది.