దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీకి తావివ్వదని, యువతే దేశానికి అసలైన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, 2025 సంవత్సరం భారత్‌కు గర్వకారణమైన విజయాలతో నిండిపోయిందని అన్నారు. భద్రత, సంస్కృతి, క్రీడలు, విజ్ఞానం, పర్యావరణం వంటి అనేక రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని గుర్తు చేస్తూ, వచ్చే ఏడాది మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
దేశ భద్రత అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని, ఉగ్రవాదానికి భారత్ ఎప్పుడూ తలవంచదని స్పష్టమైన సందేశం ఇచ్చింది అన్నారు. దేశంపై దాడులు జరిగితే సమాధానం మాటల్లో కాదు, చర్యల్లో ఉంటుందని ప్రపంచానికి చాటిన సందర్భాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని మరింత పెంచాయని చెప్పారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు చూపిన ఐక్యత, సైనికుల పట్ల వ్యక్తం చేసిన గౌరవం తనను ఎంతో కదిలించిందని మోదీ భావోద్వేగంగా పేర్కొన్నారు. దేశాన్ని కాపాడే సైనికుల వెంటే దేశం మొత్తం నిలుస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు.
భారత సంస్కృతి, సంప్రదాయాలపై మాట్లాడిన ప్రధాని, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోట్లాది మంది భక్తులు ఒకేచోట చేరి శాంతియుతంగా పాల్గొన్న దృశ్యం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇది భారత విశ్వాసానికి, సంస్కృతీ బలానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. అలాగే అయోధ్యలో జరిగిన కార్యక్రమాలు దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంచాయని, భారత వారసత్వం ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేశాయని తెలిపారు.
క్రీడారంగంలో 2025 సంవత్సరం స్వర్ణయుగంలా మారిందని ప్రధాని అన్నారు. క్రికెట్ నుంచి పారా క్రీడల వరకు భారత క్రీడాకారులు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని చెప్పారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో సత్తా చాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇది భారత సమాజంలో మారుతున్న ఆలోచనా ధోరణికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు.
విజ్ఞానం, సాంకేతిక రంగాల్లోనూ భారత్ వేగంగా ముందుకు వెళ్తోందని అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన విజయాలు యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు. కొత్త ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భారత యువత ప్రపంచంతో పోటీ పడగల స్థాయికి చేరుతోందని ప్రశంసించారు. స్టార్టప్ రంగం, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభాగాల్లో యువత చూపుతున్న సృజనాత్మకత దేశ భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వదేశీ ఉత్పత్తులపై పెరుగుతున్న ఆదరణను కూడా ప్రధాని ప్రస్తావించారు. భారతీయుల కష్టం, దేశ మట్టి వాసన ఉన్న వస్తువులను ప్రజలు గర్వంగా కొనుగోలు చేయడం ఆత్మనిర్భర భారత్‌కు బలమైన పునాదిగా మారిందన్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ దేశం ముందడుగు వేస్తోందని, వన్యప్రాణుల సంరక్షణ నుంచి ప్రకృతి వైపరీత్యాల ఎదుర్కొనడం వరకు ప్రజల భాగస్వామ్యం కీలకమని చెప్పారు.