ఉక్రెయిన్–రష్యా యుద్ధం దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఇప్పటికీ ముగింపు అనేది తెరపడలేదు. యుద్ధానికి ముగింపు దశ దగ్గరపడుతోందా అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధానికి శాంతియుత పరిష్కారం చూపించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచాన్ని వణికించిన ఈ యుద్ధాన్ని ఇక కొనసాగనివ్వకుండా ఆపడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టం తనను కలిచివేసిందన్నారు. ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తో ట్రంప్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ రెండు గంటలకు పైగా సాగినట్లు సమాచారం. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, శాంతి ఒప్పందం చాలా దగ్గరలో ఉందని తెలిపారు. చర్చలు సానుకూలంగా సాగాయని, ప్రధాన అంశాలపై పురోగతి కనిపిస్తోందని చెప్పారు. సమావేశానికి ముందు తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, యూరప్ దేశాల నేతలతోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
శాంతి ఒప్పందంలో ఇంకా కొన్ని సున్నితమైన అంశాలు మిగిలి ఉన్నాయని ట్రంప్ అంగీకరించారు. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం విషయంలో ఇరు పక్షాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. భూభాగానికి సంబంధించిన అంశాలు ఎప్పుడూ క్లిష్టమైనవేనని, అయినప్పటికీ పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం కొనసాగితే మరిన్ని ప్రాణనష్టాలు జరుగుతాయని, అది ఎవరికీ మంచిది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అందుకే వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ఖరారు చేయాలని తన బృందం ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ప్రతిపాదించిన 20 అంశాల శాంతి ప్రణాళికలో దాదాపు 90 శాతం అంశాలపై అంగీకారం కుదిరిందని ఆయన వెల్లడించారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందాల్సిన భద్రతా హామీల విషయంలో పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ సైనిక వ్యవస్థ, ఆయుధాల పరిమాణం, దేశ పునర్నిర్మాణం వంటి అంశాలపై కూడా చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. శాశ్వత శాంతికి భద్రతా హామీలే పునాది అవుతాయని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
అమెరికా, యూరప్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తూ చర్చలను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ యుద్ధం ముగిస్తే యూరప్ ఖండానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊరట కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతుందా అనే ఉత్కంఠతో ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.