ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై జరుగుతున్న ప్రచారానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టత ఇచ్చారు. అర్హులైన ఒక్కరి పింఛనూ ప్రభుత్వం తొలగించలేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం సదరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన మాత్రమేనని, అర్హత నిర్ధారణ కోసమే ఈ ప్రక్రియ చేపట్టామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు మంజూరయ్యాయని మంత్రి ఆరోపించారు. అర్హులైన వారికి పింఛన్లు అందకపోవడంతో ప్రజాధనం భారీగా వృథా అయిందన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకే ప్రస్తుతం సమీక్ష చేస్తున్నామని, నిజమైన అర్హులందరికీ పింఛన్లు తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.
దివ్యాంగుల పింఛన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.
దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి ప్రశంసించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.50 వేల కోట్లు పింఛన్లకే వెచ్చించిందన్నారు. సీఎం దివ్యాంగులకు ప్రకటించిన 7 వరాలు ప్రజల్లో విశేష స్పందన పొందాయని చెప్పారు.
ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యూ ఇయర్ సందర్భంగా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.