ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా అనేక మంది పిల్లలు, యువతీయువకులు చదువుకు దూరమవ్వాల్సి వస్తోంది. చదవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితులవల్ల చదువు మధ్యలో ముగించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ఆశాజనకమైన అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చదువును మానేసిన వారు తిరిగి విద్యలో చేరేందుకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ద్వారా ఓపెన్ స్కూల్ పద్ధతిలో నేరుగా పదో తరగతి, ఇంటర్‌లో చేరే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 15తో దరఖాస్తులకు గడువు ముగిసిపోయినా, భారీ స్పందన రావడంతో ప్రభుత్వం రూ.600 లేట్ ఫీజుతో గడువును డిసెంబర్ 6 వరకు పొడగించింది. తిరిగి చదువుకోవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.
ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా 10వ తరగతిలో చేరాలనుకునేవారు 14 ఏళ్లు పూర్తయ్యి ఉండాలి. అలాగే చదవడం, రాయడం వచ్చి ఉండటం తప్పనిసరి. వారు ఎంచుకున్న సబ్జెక్టుల్లో సెలవు రోజుల్లో శిక్షణ పొందుతూ పరీక్షలకు హాజరుకావచ్చు. ఇప్పటికే 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్‌లో చేరకుండా ఆగిపోయిన వారు, లేదా ఇంటర్‌లో చేరి మధ్యలో వదిలేసిన వారు నేరుగా ఇంటర్‌లో చేరే అవకాశం పొందవచ్చు. ఇంటర్‌లో చేరేందుకు కనీస అర్హత 15 ఏళ్లు పూర్తై ఉండటం. విద్యార్థులు తమకు కావాల్సిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. సెలవు రోజుల్లో జరిగే తరగతులకు హాజరై పరీక్షలు రాయవచ్చు.
ఇంతేకాకుండా గతంలో పదో తరగతి లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ప్రభుత్వం పెద్ద అవకాశం కల్పించింది. వారు పాస్ అయిన రెండు సబ్జెక్టుల మార్కులను ఓపెన్ స్కూల్‌కు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ సబ్జెక్టును మాత్రమే తిరిగి రాస్తే సరిపోతుంది. ఈ విధంగా విద్యార్థులకు పరీక్షల భారం తగ్గించడంతో పాటు తిరిగి చదువులోకి రప్పించడమే సార్వత్రిక విద్యాపీఠం లక్ష్యం. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులు అనేక మందికి విద్యాభ్యాసం పునఃప్రారంభించే సౌకర్యం కల్పిస్తున్నాయి.
ఓపెన్ స్కూల్‌లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, సులభంగా అర్థమయ్యే స్వీయ అభ్యసన పుస్తకాలు పంపిణీ చేస్తోంది. అలాగే జ్ఞానధార యూట్యూబ్ ఛానల్, అధికారిక ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్ పాఠాలు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. APOSS ఇచ్చే సర్టిఫికెట్లు దేశంలోని ఏ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు పొందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులకు ఎంట్రీ ఫీజులో రాయితీలు కూడా లభిస్తాయి. చదువు మధ్యలో ఆగిపోయిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.