ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకుంటున్నాం. ఒకప్పుడు పేదల ఆహారంగా భావించిన మిల్లెట్స్ ఇప్పుడు పోషకాహారంగా గుర్తింపు పొందుతున్నాయి. ముఖ్యంగా బరువు నియంత్రణ కోరుకునే వారు గోధుమ రొట్టెలకు బదులు మిల్లెట్ రొట్టెల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సజ్జ రొట్టె, జొన్న రొట్టి మధ్య ఏది మంచిది అనే చర్చ చాలామందిలో మొదలైంది.
సజ్జలు ఇది మన దేశంలో ఎండ ప్రాంతాల్లో విస్తృతంగా పండుతుంది. సజ్జ రొట్టె తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే అధిక ఫైబర్. రోజులో తరచూ ఆకలి వేయకుండా ఉండాలంటే సజ్జలు మంచి ఎంపికగా పోషక నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేయడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో కూడా సజ్జలు సహాయపడుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారికీ, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
సజ్జల్లో ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి ఉత్పత్తి, కండరాల పనితీరు, మెటబాలిజం మెరుగుపడటానికి సహకరిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా బజ్రాసజ్జ రొట్టె మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా బజ్రా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.
మరోవైపు జొన్న, అంటే సొర్గమ్ కూడా పోషక విలువలతో నిండిన మిల్లెట్. జొన్న రొట్టి తేలికగా జీర్ణమవుతుంది. జొన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల దీర్ఘకాలిక రోగాల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
జొన్నలో మంచి పరిమాణంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కండరాల బలాన్ని పెంచడంలో, శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే ఆకలి ఆలస్యంగా వేస్తుంది. అందువల్ల అధికంగా తినే అలవాటు తగ్గి, బరువు నియంత్రణ సాధ్యమవుతుంది. అలాగే జొన్నలో ఉండే ద్రవీభవించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అయితే బరువు తగ్గడానికి ఏ రొట్టి మంచిది అనే ప్రశ్నకు ఒకే సమాధానం చెప్పలేం. సజ్జ రొట్టె ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, ఖనిజాలు ఎక్కువగా అందిస్తుంది. జొన్న రొట్టి తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు అందిస్తుంది. శరీర స్వభావం, జీర్ణశక్తి, ఆరోగ్య సమస్యలను బట్టి ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.
పోషక నిపుణులు చెప్పేది ఒక్కటే. ఒకే రకం ఆహారాన్ని రోజూ తినడం కంటే, సజ్జలు జొన్న రెండింటినీ మారుస్తూ ఆహారంలో చేర్చడం ఉత్తమం. కూరగాయలు, పప్పులు, పెరుగు వంటి సమతుల్య ఆహారంతో కలిసి మిల్లెట్ రొట్టెలు తీసుకుంటే బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. డైట్‌లో చిన్న మార్పులు చేసినా, వాటి ప్రభావం దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలు ఇస్తాయని ఈ మిల్లెట్ రొట్టెలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.