రాష్ట్రంలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)–2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగిశాయి. డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 21తో పూర్తయ్యాయి. విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించగా, అభ్యర్థుల నుంచి కూడా మంచి స్పందన లభించింది.
ఈ టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,71,698 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 2,48,427 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం 91.43 శాతం హాజరు నమోదు కావడం గమనార్హం. గత టెట్ పరీక్షలతో పోలిస్తే ఈసారి హాజరు శాతం గణనీయంగా పెరగడం, రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిరుద్యోగ అభ్యర్థుల్లో ఉన్న ఆశాభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా వెయిటేజీ మార్కులు పెంచుకోవాలనే లక్ష్యంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యారు.
టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలు విద్యాశాఖ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదల చేయగా, వాటితోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లో ప్రవేశించి ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.
డిసెంబర్ 15, 16, 17, 18 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు డిసెంబర్ 22న విడుదలయ్యాయి. ఇక 19, 20, 21 తేదీల్లో నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీలు డిసెంబర్ 26న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం, అన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీలు 2026 జనవరి 2 నాటికి పూర్తిగా విడుదల చేస్తారు. అనంతరం ఫైనల్ కీని జనవరి 13న, తుది ఫలితాలను జనవరి 19న ప్రకటించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించడంతో, టెట్ ఫలితాలపై నిరుద్యోగ అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.