దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబై వరకు… ఐటీ హబ్ బెంగళూరు నుంచి తీర నగరం చెన్నై వరకు… భారతదేశ అభివృద్ధికి ప్రతీకలుగా చెప్పుకునే ఈ మహానగరాలు భూగర్భ జలాలను హద్దులు దాటేలా వినియోగించడం వల్ల దేశంలోని ఐదు అతిపెద్ద నగరాల కింద ఉన్న భూమి క్రమంగా కుంగిపోతోందని తాజా అంతర్జాతీయ అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ విషయం కేవలం పర్యావరణ హెచ్చరిక కాదు. ఇది పట్టణ ప్రణాళిక వైఫల్యానికి అద్దం పడుతోంది. కోట్ల రూపాయల విలువైన భవనాలు, వంతెనలు, రహదారులు, మెట్రో మార్గాలు నెమ్మదిగా అస్థిరత వైపు జారుతున్నాయనే సంకేతంగా ఈ నివేదిక నిలుస్తోంది. 2015 నుంచి 2023 మధ్య ఉపగ్రహ రాడార్ డేటాను ఆధారంగా తీసుకుని శాస్త్రవేత్తలు చేసిన విశ్లేషణలో, ఐదు మెట్రో నగరాల్లో కలిపి 878 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇప్పటికే కుంగిపోతోందని తేలింది.
ఈ భూమి కింద కుంగిదల ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలపై పడుతోంది. సుమారు 8 కోట్ల మంది నివసించే ప్రాంతాలు, 1.3 కోట్లకు పైగా భవనాలు ఈ ప్రమాదానికి లోనవుతున్నట్లు అధ్యయనం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో భూమి ప్రతి ఏడాది 4 మిల్లీమీటర్లకు మించి కుంగిపోతోంది ఢిల్లీలో అయితే కొన్ని జేబు ప్రాంతాల్లో ఏడాదికి 5 సెంటీమీటర్ల వరకు భూమి కుంగిపోతున్నట్లు నమోదైంది. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, పదేళ్లలో భవనాల పునాదులనే బలహీనపరచే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది.
చెన్నై పరిస్థితి మరింత ఆందోళనకరం. అద్యార్ నది వరద మైదానాల చుట్టూ ఉన్న ప్రాంతాలు, నగర హృదయంలోని పలు నివాస కాలనీలు అత్యంత వేగంగా కుంగిపోతుంది. కోడంబాక్కం, వలసరవాక్కం, ఆలందూర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల అతివినియోగమే ప్రధాన కారణంగా మారింది. ఒకప్పుడు వరదలతో పోరాడిన ఈ నగరం, ఇప్పుడు భూమి కుంగిపోవడం అనే కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.
ముంబైలో భూమి సమస్య మొత్తం నగరానికి కాకపోయినా దారావి వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న పేద ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. బెంగళూరులో రాతి పొరలు ఎక్కువగా ఉండటం వల్ల భూమి కుంగే వేగం తక్కువగా ఉన్నా, ఇటీవల పెరుగుతున్న భూగర్భ జలాల వినియోగం అక్కడ కూడా ప్రమాద గంటలు మోగిస్తోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్పష్టంగా కనిపిస్తోంది. నియంత్రణలేని బోర్‌వెల్స్, వర్షపు నీటి నిల్వల లోపం, పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు. భూమి లోపలి నీటి పొరలు ఖాళీ కావడంతో మట్టి కుదించబడుతోంది. దానికి తోడు, పైభాగంలో పెరిగిపోతున్న భవనాల బరువు భూమిపై అదనపు ఒత్తిడిని మోపుతోంది. ఈ అధ్యయనం ద్వారా తెలిసింది ఏమిటంటే అభివృద్ధి పేరుతో భూమిని తొవ్వుకుంటూ పోతే ఆ భూమే మన నుంచి జారిపోతుంది తెలుపుతున్నారు.