బరువు తగ్గాలని అనుకునే వారికి ఉదయపు అల్పాహారం చాలా ముఖ్యమైనది. మన దేశంలో ఎక్కువగా ఇడ్లీ, పరాఠా వంటి వంటకాలు బ్రేక్‌ఫాస్ట్‌గా తింటారు. ఈ రెండు కూడా రుచికరమైనవి, సులభంగా తయారయ్యే వంటకాలు. కానీ బరువు తగ్గాలి అనుకునే వారు ఏది ఎంచుకోవాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే రెండు వంటకాలలో రుచితో పాటు పోషకాలు కూడా ఉంటాయి. అయితే వీటి తయారీ విధానం, పదార్థాలు, దినచర్యపై చూపే ప్రభావం కొంచెం వేరుగా ఉంటుంది.
ఇడ్లీ ఒక తేలికపాటి వంటకం దీనిని ఆవిరిలో ఉడికిస్తారు కాబట్టి నూనె లేదా నెయ్యి అవసరం ఉండదు. అందువల్ల ఇతర అల్పాహారాలతో పోల్చితే ఇడ్లీలో కాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కాలరీలను తీసుకోవడం ముఖ్యమైన విషయం. ఇడ్లీ తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఉంటుంది, కానీ శరీరానికి భారంగా అనిపించదు. అంతేకాకుండా, ఇడ్లీ తయారీలో ఉపయోగించే పిండిని ఫెర్మెంటేషన్ చేస్తారు. దాంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
ఇడ్లీలో లభించే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మన శరీరానికి నెమ్మదిగా శక్తిని ఇస్తాయి. వెంటనే ఆకలి వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి పనిచేసే వాళ్లు, విద్యార్థులు లేదా బిజీ షెడ్యూల్‌లో ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. ఒక ప్లేట్ ఇడ్లీతో ఉదయం శక్తివంతంగా ప్రారంభించవచ్చు.
ఇంకా పరాఠా గురించి మాట్లాడితే ఇది కొంచెం గట్టిగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ పరాఠాను ఎక్కువగా నూనె లేదా నెయ్యితో కాల్చుతారు. అందువల్ల ఇది ఇడ్లితో పోలిస్తే ఎక్కువ కాలరీలు కలిగి ఉంటుంది. అయితే సంపూర్ణ గోధుమ పిండితో చేస్తే పరాఠాలో మంచి ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది మరియు ఎక్కువసేపు ఆకలి రాదు. ఇది కూడా బరువు తగ్గాలనుకునే వారికి కొంత ఉపయోగకరమే.
పరాఠాను కూరగాయలు, పనీర్, ఆకుకూరలు వంటి పదార్థాలతో నింపితే పోషక విలువ పెరుగుతుంది. ఉదయాన్నే తిన్న పరాఠా మద్యాహ్నం వరకు శక్తిని ఇస్తుంది. అయితే ఎక్కువ నూనె లేదా నెయ్యి వాడితే పరాఠా ఆరోగ్యానికి మంచిది కాదు. కాలరీలు పెరగవచ్చు. కాబట్టి పరాఠా తినాలనుకునేవారు తక్కువ నూనెతో తయారు చేయడం మంచిది.
ఎవరికి ఏది మంచిది..
బరువు తగ్గాలని అనుకునే వారికి ఇడ్లీ చాలా సరైన ఆప్షన్. ఇది తేలికగా ఉండి, కాలరీలు తక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. పరాఠా కూడా పోషకాలు ఇస్తుంది కానీ నూనె వాడకం ఎక్కువైతే బరువు పెరగే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇడ్లీని ఎంచుకోవడం మంచిది. పరాఠా తినాలనుకుంటే ఆరోగ్యకరమైన విధంగా తయారు చేసుకోవాలి.