ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధిపై ముందడుగు వేస్తోంది. ఏపీటూరిజం సంస్థ ఇప్పటికే ఆధ్యాత్మిక, ప్రకృతి, సాహస ప్రాంతాల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఈ ప్యాకేజీలకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కూడా పర్యాటక సేవల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళనాడులోని అరుణాచలం, కేరళలోని శబరిమల కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీ, ఇప్పుడు శీతాకాలం నేపథ్యంలో అరకులోయకు ప్రత్యేక టూర్ బస్సులను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది.
శీతాకాలంలో అరకులోయ, లంబసింగి వంటి చల్లని ప్రాంతాలకు పర్యాటకులు పెద్దఎత్తున ప్రకృతి ప్రేమికులు వెళుతూ ఉంటారు ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఏపీఎస్ఆర్టీసీ అరకు యాత్ర స్పెషల్ పేరుతో వీకెండ్ టూర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రధాన డిపోల నుంచి ఈ బస్సులు నడపాలని అధికారులు తెలిపారు. ఈ టూర్‌ను ప్యాకేజీ రూపంలో అందించడం వల్ల ప్రయాణికులు ఒకే ప్రయాణంలో అనేక ప్రదేశాలను సందర్శించే అవకాశం పొందుతారు.
అలాగే బస్సుల్లో ప్రత్యేక సీటింగ్, గైడ్ సపోర్ట్, టూర్ మేనేజ్‌మెంట్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు.ఈ అరకులోయ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు అరకులోయ అందమైన అడవులు, లోయలు, చల్లని వాతావరణం, ప్రకృతి సోయగాలు అన్ని అనుభవించవచ్చు. లంబసింగి హిల్ స్టేషన్ కూడా ఇందులో భాగం కావడం ట్రిప్‌కు మరింత ఆకర్షణను కలిగిస్తోంది. అదనంగా బొర్రా గుహలు, తాడే జంగిల్ బెల్స్, వంజంగి హిల్స్, తంజింగి రిజర్వాయర్, మత్స్యగుండం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు కూడా ఈ యాత్రలో ఉన్నాయి.
ఇంకా అరకులోయ ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ వంటి ప్రముఖ ప్రాంతాలను కూడా ప్రయాణికులు ఒకే ట్రిప్‌లో చూడవచ్చు. ఇంత పెద్ద ప్యాకేజీ ఒకేసారి అందుబాటులో ఉండడంతో ఇప్పటికే డిపోల వద్ద రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన టికెట్ ధరలు, ప్రయాణ సమయాలు, పికప్–డ్రాపింగ్ పాయింట్ల వంటి వివరాలు ప్రతి ఆర్టీసీ డిపోలో అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆసక్తి ఉన్న వారు సమీప డిపో అధికారులను సంప్రదించవచ్చు. ఈ అరకులోయ వీకెండ్ బస్సు ప్యాకేజీ శీతాకాలంలో మంచి ఆకర్షణగా మారుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఫ్యామిలీ ట్రావెలర్స్, ఫోటోగ్రఫీ అభిమానులకు ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇది ఉపయోగకరమవుతుందని, ఏపీఎస్ఆర్టీసీ ఈ టూర్‌పై మంచి ఆశలు పెట్టుకుంది