భారత జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, లోక్‌సభలో నిర్వహించిన ఉత్సవాల చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొనడం తనకు గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. సంవత్సరం పొడవునా ఈ ఉత్సవాలను జరుపుకొంటున్నామని ఆయన సభకు తెలిపారు.
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకగా వందేమాతరం నిలిచిందని, స్వాతంత్ర్య ఉద్యమానికి ఇది శక్తిని, ప్రేరణను అందించిన కీలకమైన మూలమని ప్రధాని మోదీ బలంగా ఉద్ఘాటించారు. దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో, ఈ రోజు జరిగిన చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చరిత్రను గుర్తుచేసుకుంటూ, 1857 తిరుగుబాటు తర్వాత స్వాతంత్ర్య సమరయోధులపై ఆంగ్లేయులు తీవ్రమైన ఒత్తిడిని పెంచారని ప్రధాని తెలిపారు. అయితే, ఎంత ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా కవులు, రచయితలు వందేమాతరం గేయాన్ని రచించారని, ఈ నినాదం తదనంతర కాలంలో బ్రిటిషర్లకు సింహస్వప్నంగా మారిందని మోదీ వివరించారు.
ఈ నినాదం భారత్ నలువైపులా మారుమోగింది, మాతృభూమి యొక్క దాస్య శృంఖలాలను తెంచేందుకు ఇది కీలకంగా మారిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా వందేమాతరం గేయంపై రాసిన కవితలు చదివి వినిపించారు. వందేమాతరం నినాదం కేవలం స్వాతంత్ర్య నినాదం మాత్రమే కాదని, ఇది 'ఆజాద్ భారత్‌కు విజన్'గా మారిందని ఆయన అభివర్ణించారు.
ఆంగ్లేయుల పాలనలో భారతీయుల శక్తి సామర్థ్యాలపై అనేక సందేహాలు వెలిబుచ్చినప్పటికీ, కష్టసమయంలో ప్రజలకు దారిదీపంగా వందేమాతరం నిలిచిందని మోదీ గుర్తుచేశారు. మన దేశం జ్ఞానం, సమృద్ధికి మారుపేరు అని, ఈ దేశ గౌరవాన్ని వందేమాతరం నినాదం కాపాడిందని తెలిపారు.
స్వాతంత్ర్య ఉద్యమ ప్రతి సమయంలోనూ వందేమాతరం వినిపించిందని, ఇది దేశ ఐక్యతకు చిహ్నంగా నిలిచిందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, వందేమాతర నినాదం భారత్ ముక్కలు కాకుండా కాపాడటంలో కీలక పాత్ర వహించిందని ఆయన అన్నారు.
ముఖ్యంగా, బంగాల్ ఐక్యతకు ఈ గేయం యొక్క పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. వందేమాతర నినాదం ఉచ్చరించకూడదని ఆంగ్లేయులు నిషేధం విధించినప్పటికీ, అది బంగాల్ వీధుల్లో ప్రారంభమై దేశ ప్రజల నినాదంగా మారిందని, ఆఖరికి చిన్నారులు కూడా వందేమాతరం నినాదాలు చేశారని ప్రధాని వివరించారు. ఈ నినాదాలు వినలేక ఆంగ్లేయులు దారుణాలకు ఒడిగట్టి, దేశంలో అనేకచోట్ల ఉద్యమకారులను కఠినంగా అణచివేశారని మోదీ పేర్కొన్నారు.
అయినా, వందేమాతరం నినాదాలు చేస్తూ ఎందరో ప్రాణాలు అర్పించారని, ఉరిశిక్ష అమలు చేసే ముందు కూడా వారు ఇదే నినాదాన్ని చేశారని ప్రధాని మోదీ లోక్‌సభలో ఉద్వేగంగా వెల్లడించారు. ఈ చర్చలు యువతరానికి దేశభక్తిని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తాయని ఆయన ముగించారు.