తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ, టెలివిజన్ వంటి రంగాల్లో పెట్టుబడుల విధానాలను సరళీకృతం చేయడం వల్ల కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమైందన్నారు.
భారత్ గ్లోబల్ స్థాయిలో తన స్థానం బలపరుచుకుంటోందని కేంద్ర మంత్రి తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 81వ స్థానం నుంచి 38వ స్థానానికి ఎదగడం దేశంలో జరుగుతున్న మార్పులకు నిదర్శనమన్నారు. గత దశాబ్ద కాలంగా స్టార్టప్ రంగంలో భారత్ వేగంగా ముందుకు దూసుకుపోతోందని, యువత ఆవిష్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు.
అంతరిక్ష రంగంలో కూడా భారత్ విశేష పురోగతి సాధించిందని జితేంద్రసింగ్ వెల్లడించారు. ప్రస్తుతం స్పేస్ ఎకానమీలో భారత్ 8వ స్థానానికి చేరుకుందని తెలిపారు. చంద్రుడిపై చేపట్టిన ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని, అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం వల్ల ఈ రంగం మరింత విస్తరిస్తోందన్నారు.
రక్షణ రంగంలోనూ భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రక్షణ సామగ్రి ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధించామని, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందన్నారు. అలాగే కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు అత్యధికంగా వ్యాక్సిన్లు ఎగుమతి చేసిన దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయించే బడ్జెట్ గణనీయంగా పెరిగిందని జితేంద్రసింగ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కీలక ఖనిజాల రంగంలో కూడా ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.