యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సహా జీసీసీ దేశాలలో నివసిస్తున్న విదేశీయులు ఇప్పుడు ఒకే సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ ఈ-వీసా” కోసం ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా ఒకే వీసాతో సంవత్సరంలో అనేక సార్లు సౌదీకి వెళ్లే అవకాశం లభిస్తుంది. పర్యటనలు, వ్యాపార సమావేశాలు, కుటుంబ సభ్యుల సందర్శన, ఉమ్రా వంటి ప్రయాణాలకు ఈ వీసా అనువైనది.
సౌదీ అధికారిక యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్ — ksavisa.sa ద్వారా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసుల కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇక ప్రతి సారి ఎంబసీకి వెళ్లి వీసా కోసం సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం లేకుండా ఒకే సారి ఆన్‌లైన్‌లో పూర్తి ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
వీసా రకాలూ మరియు చెల్లుబాటు కాలం:
సౌదీ ప్రస్తుతం జీసీసీ నివాసితులకు రెండు రకాల ఈ–వీసాలు అందిస్తోంది. మొదటిది సింగిల్ ఎంట్రీ వీసా, ఇది ఒకసారి మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తుంది, గరిష్టంగా 90 రోజుల పాటు ఉండే వీలుంటుంది. రెండవది మల్టిపుల్ ఎంట్రీ వీసా, ఇది ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది మరియు ఆ కాలంలో ఎన్నిసార్లయినా ప్రవేశించవచ్చు. ప్రతి ప్రవేశానికి గరిష్టంగా 90 రోజులు సౌదీలో ఉండే అవకాశం ఉంటుంది.
అర్హత మరియు అవసరమైన పత్రాలు:
యూఏఈలో నివసిస్తున్న వ్యక్తులు ఈ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే కనీసం మూడు నెలలు చెల్లుబాటు అయ్యే యూఏఈ రెసిడెన్స్ వీసా ఉండాలి. అలాగే కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉండాలి. స్వతంత్రంగా ప్రయాణించే వారు 18 ఏళ్లు పైబడినవారు కావాలి. 18 ఏళ్లలోపు ఉన్నవారు తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో పాటు మాత్రమే ప్రయాణించాలి.
దరఖాస్తు సమయంలో మీరు అందించాల్సిన పత్రాలు :
పాస్‌పోర్ట్ ప్రతులు, యూఏఈ రెసిడెన్స్ వీసా ప్రతులు, తెల్లని నేపథ్యంతో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఫోటో 35 x 45 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండాలి. ముఖం సూటిగా కెమెరా వైపు చూడాలి, ఎలాంటి నీడలు లేకుండా స్పష్టంగా ఉండాలి. ఫోటో ఫార్మాట్ PNG లేదా JPEGలో, గరిష్ట పరిమాణం 5MBలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం – స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:
ముందుగా ksavisa.sa వెబ్‌సైట్‌కి వెళ్లి Visit అనే విభాగాన్ని ఎంచుకోవాలి. అక్కడ Tourism ఎంపిక చేసి, Do you have valid GCC residence? వద్ద Yes అని క్లిక్ చేయాలి. తరువాత Electronic Visa (eVisa) ఎంపిక చేసుకుని Apply Now క్లిక్ చేయాలి.
అదనంగా మీరు మీ దేశం నివాస దేశం (UAE), ప్రయాణ ఉద్దేశ్యం, మరియు సౌదీకి చేరే అంచనా తేదీ వంటి వివరాలు ఇవ్వాలి. తరువాత వ్యక్తిగత వివరాలు
పూర్తి పేరు, మొబైల్ నంబర్, నివాస చిరునామా, వృత్తి, పుట్టిన తేదీ మొదలైనవి నమోదు చేయాలి. తర్వాత పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్స్ వీసా కాపీలు అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించి Agree to Terms వద్ద అంగీకరించాలి.
ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా కంపెనీల జాబితా కనిపిస్తుంది. ఒక సంస్థను ఎంపిక చేసుకోవాలి. ఈ బీమా తప్పనిసరి మరియు వీసా ఫీజుతో పాటు చెల్లించాలి.
వీసా ఫీజులు మరియు సమయ వ్యవధి:
వీసా ఫీజు సుమారు 81 అమెరికా డాలర్లు అప్లికేషన్ ఫీజు $10.50 మరియు మెడికల్ ఇన్సూరెన్స్ ఖర్చు సంస్థలవారీగా మారుతుంది — కనీసం $7.5 నుండి గరిష్టంగా $252 వరకు ఉండవచ్చు. మొత్తం చెల్లింపు తర్వాత మీకు ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది, దీని ద్వారా మీరు వీసా స్థితిని ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా జీసీసీ నివాసితులకు ఈ–వీసా తక్షణమే వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో మూడు పని రోజుల వరకు సమయం పట్టవచ్చు. వీసా ఆమోదం తర్వాత మీ ఈమెయిల్‌కి పంపబడుతుంది.
ముఖ్య సూచన
హజ్ సీజన్ సమయంలో ఈ వీసా ద్వారా ఉమ్రా చేయడం సాధ్యం కాదు. అయితే హజ్ సీజన్‌కి వెలుపల ఉమ్రా యాత్రలు చేయవచ్చు.
ఈ కొత్త విధానం గల్ఫ్ ప్రవాసులకు ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. సౌదీ అరేబియాకు తరచుగా వెళ్లే వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, ఉమ్రా యాత్రికులు అందరికీ ఈ మల్టిపుల్ ఎంట్రీ ఈ వీసా ఒక సౌకర్యవంతమైన, వేగవంతమైన పరిష్కారంగా మారింది. ఇది జీసీసీ దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడంలో కూడా సహకరిస్తోంది