కింగ్ చార్లెస్ కాపాడతారా? మూతపడే ప్రమాదంలో లండన్‌లోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్
London’s Iconic Indian Restaurant: బ్రిటన్‌లో భారతీయ వంటకాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చారిత్రక రెస్టారెంట్ మూతపడే పరిస్థితి ఎదుర్కొంటోంది. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన లండన్‌లోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్ ‘వీరాస్వామి’ (Veeraswamy) తన చిరకాల చిరునామాను కోల్పోయే ప్రమాదంలో ఉంది. భవన యజమానితో కొనసాగుతున్న లీజు వివాదం కారణంగా ఈ రెస్టారెంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రెస్టారెంట్ ఉద్యోగులు, మద్దతుదారులు నేరుగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III జోక్యం చేసుకుని ఈ చారిత్రక సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
100 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రెస్టారెంట్‌కు ముప్పు.. కింగ్ చార్లెస్‌కు సిబ్బంది విజ్ఞప్తి..
బ్రిటన్‌లో భారతీయ వంటకాల చిరునామాకు ముప్పు.. వీరాస్వామి రెస్టారెంట్‌పై లీజు వివాదం..
బ్రిటన్‌లో భారతీయ వంటకాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చారిత్రక రెస్టారెంట్ మూతపడే పరిస్థితి ఎదుర్కొంటోంది. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన లండన్‌లోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్ ‘వీరాస్వామి’ (Veeraswamy) తన చిరకాల చిరునామాను కోల్పోయే ప్రమాదంలో ఉంది. భవన యజమానితో కొనసాగుతున్న లీజు వివాదం కారణంగా ఈ రెస్టారెంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రెస్టారెంట్ ఉద్యోగులు, మద్దతుదారులు నేరుగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III జోక్యం చేసుకుని ఈ చారిత్రక సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
లండన్‌లోని ప్రముఖ రీజెంట్ స్ట్రీట్‌లో ఉన్న వీరాస్వామి రెస్టారెంట్‌ను 1926లో ఎడ్వర్డ్ పాల్మర్ ప్రారంభించారు. ఆయన జనరల్ విలియం పాల్మర్ మునిమనవడు. జనరల్ విలియం పాల్మర్ బ్రిటిష్ పాలనలో భారతదేశ తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్‌కు సైనిక, వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి వీరాస్వామి రెస్టారెంట్ క్రమంగా లండన్‌లో భారతీయ ఆహార సంస్కృతికి ప్రత్యేక చిరునామాగా ఎదిగింది.
దాదాపు శతాబ్ద కాలంలో ఈ రెస్టారెంట్‌కు ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, హాలీవుడ్ నటులు చార్లీ చాప్లిన్, మార్లన్ బ్రాండో వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఇక్కడ భోజనం చేశారు. కాలక్రమంలో ప్రాంతీయ భారతీయ వంటకాలను ఉన్నత స్థాయి ఆహార అనుభవంగా పరిచయం చేస్తూ గుర్తింపు పొందింది. మిచెలిన్ స్టార్ అందుకున్న రెస్టారెంట్‌గా కూడా పేరు సంపాదించింది. భారతీయ వంటకాల వైవిధ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఇప్పుడు ఈ చారిత్రక రెస్టారెంట్ ఉనికికే ముప్పు ఏర్పడింది. రెస్టారెంట్ ఉన్న విక్టరీ హౌస్ భవనానికి యజమానిగా ఉన్న క్రౌన్ ఎస్టేట్‌తో లీజు విషయంలో వివాదం కొనసాగుతోంది. క్రౌన్ ఎస్టేట్ అనేది బ్రిటిష్ రాజకుటుంబానికి అనుబంధంగా ఉన్న ఆస్తుల నిర్వహణ సంస్థ. 2024లోనే వీరాస్వామి రెస్టారెంట్ యాజమాన్యానికి లీజును పునరుద్ధరించబోమని ఈ సంస్థ తెలియజేసింది. విక్టరీ హౌస్ భవనంలో సమగ్ర ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉందని, రెస్టారెంట్ కొనసాగుతున్న సమయంలో నిర్మాణ పనులు చేపట్టడం సురక్షితం కాదని భవన యజమాని అభిప్రాయపడినట్లు సమాచారం.
ఈ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, గురువారం ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరగనుంది. వీరాస్వామి రెస్టారెంట్ యజమాని సంస్థ ఎండబ్ల్యూ ఈట్ (MW Eat) ఛైర్మన్ రంజిత్ మాథ్రానీ ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన యజమాని లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నించామని ఆయన తెలిపారు. అయినప్పటికీ రెస్టారెంట్ చరిత్ర, సంప్రదాయం, దాని పాత్ర, భారతీయ వంటకాల వారసత్వానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే నిర్ణయం ఇతర దేశాల వంటకాల రెస్టారెంట్ విషయంలోనూ తీసుకునేవారా? అని మాథ్రానీ ప్రశ్నించారు. ప్రముఖ చెఫ్ గోర్డన్ రామ్‌సే నిర్వహించే రెస్టారెంట్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదా? అంటూ తన అసంతృప్తిని వెల్లడించారు. అయితే క్రౌన్ ఎస్టేట్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తాము ఏదైనా ప్రత్యేక దేశం లేదా ప్రాంతానికి చెందిన వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. లండన్ వెస్ట్ ఎండ్ ప్రాంతంలోని తమ రెస్టారెంట్లలో విభిన్న సంస్కృతులు, వంటకాల సమాహారాన్ని అందిస్తున్నామని, లండన్ నగర వైవిధ్యమే తమ ఆహార సేవల్లోనూ ప్రతిబింబిస్తోందని పేర్కొంది.
మరోవైపు, రెస్టారెంట్ ఉద్యోగులు, చారిత్రక వారసత్వ పరిరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు ఈ సమస్య పరిష్కారానికి రాజకుటుంబం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కింగ్ చార్లెస్ III ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించి, వీరాస్వామి రెస్టారెంట్ తన చారిత్రక చిరునామాలోనే కొనసాగేందుకు మార్గం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2026లో వందేళ్ల మైలురాయిని చేరుకున్న ఈ రెస్టారెంట్‌ను కనీసం తన శతాబ్ది వేడుకల తర్వాత కూడా అదే ప్రదేశంలో కొనసాగించేలా పరిష్కారం లభించాలని వారు ఆశిస్తున్నారు.
ఈ క్రమంలో వీరాస్వామికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొస్తున్నారు. రెస్టారెంట్‌ను కాపాడాలంటూ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పిటిషన్లపై ఇప్పటివరకు 20 వేలకు పైగా సంతకాలు నమోదయ్యాయి. అయినప్పటికీ కింగ్ చార్లెస్ III ఇప్పటివరకు ఈ వివాదంపై జోక్యం చేసుకోలేదు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
వీరాస్వామి సమస్య ఒక రెస్టారెంట్ భవిష్యత్తుకే పరిమితమైనది కాదు. బ్రిటన్‌లో భారతీయ ఆహార సంస్కృతి దాదాపు వందేళ్లుగా సాధించిన గుర్తింపు, వారసత్వానికి సంబంధించిన అంశంగా కూడా మారింది. కాలంతో పాటు మారుతున్న నగరంలో పాత భవనాలు, చారిత్రక సంస్థలను ఎలా కాపాడుకోవాలనే ప్రశ్నను ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది.