ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మెప్మా (MEPMA) స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల కోసం మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కేశినేని ఫౌండేషన్, ఎన్వుఇండియా (NV India), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRD) సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు. చెదలు, బొద్దింకలు, దోమలు వంటి హానికర కీటకాల నివారణపై ఈ శిక్షణ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ఎన్ఐఆర్డీ సహకారంతో సుమారు 400 మంది మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ అందించామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధి అవకాశాలను పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
భవిష్యత్తులో మహిళలకు మరిన్ని ఉపాధి మార్గాలు అందుబాటులోకి తీసుకురావడానికి పుట్టగొడుగుల పెంపకం, బంజారా డ్రెస్ తయారీ, బంజారా జ్యూవెలరీ తయారీ వంటి రంగాల్లో కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. సంప్రదాయ కళలు, చేతివృత్తులను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, వాటికి మంచి ఆదరణ లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శిక్షణల ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను వృత్తులుగా మలుచుకొని స్వయం ఉపాధి సాధించగలుగుతారని చెప్పారు.
అదేవిధంగా మెప్పా, డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఉత్పత్తులు తయారుచేయడమే కాకుండా, వాటిని మార్కెట్‌లో అమ్ముకునే అవకాశాలు కల్పించడం ద్వారా మహిళల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో సమన్వయం చేస్తూ మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదని, ఆ దిశగా తమ కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.