ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేసిన తర్వాత రావాల్సిన రీఫండ్ ఆలస్యమైతే సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ వడ్డీ చెల్లిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 244A ప్రకారం రీఫండ్ మొత్తంపై నెలకు 0.5 శాతం (ఏడాదికి 6 శాతం) వడ్డీ లభిస్తుంది. అయితే, అన్ని ట్యాక్స్ పేయర్లకు ఈ వడ్డీ తప్పనిసరిగా వస్తుందని అనుకోవడం పొరపాటు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రీఫండ్ ఆలస్యమైనా వడ్డీ చెల్లించరని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
రీఫండ్‌పై వడ్డీ రాకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ‘10 శాతం నిబంధన’ ఒకటి. మీకు రావాల్సిన రీఫండ్ మొత్తం, మీరు చెల్లించాల్సిన మొత్తం పన్నులో 10 శాతం కంటే తక్కువగా ఉంటే, ఆ రీఫండ్‌పై ఎలాంటి వడ్డీ ఇవ్వరు. ఉదాహరణకు మీ పన్ను బాధ్యత రూ.1 లక్ష అయితే, రీఫండ్ రూ.10 వేలలోపే ఉంటే వడ్డీ లభించదు. ఈ నియమం వల్ల చాలామంది ట్యాక్స్ పేయర్లు వడ్డీకి అర్హులు కారు.
అలాగే ఐటీఆర్‌ను ఆలస్యంగా (Belated ITR) ఫైల్ చేసిన వారికి కూడా వడ్డీ నష్టం తప్పదు. గడువులోపు రిటర్న్ దాఖలు చేస్తే ఏప్రిల్ 1 నుంచి రీఫండ్ వచ్చిన తేదీ వరకూ వడ్డీ లెక్కిస్తారు. కానీ గడువు దాటాక ఫైల్ చేస్తే, మీరు రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి మాత్రమే వడ్డీ లభిస్తుంది. దీంతో ఏప్రిల్ నుంచి ఫైలింగ్ చేసిన తేదీ వరకూ రావాల్సిన వడ్డీ కోల్పోతారు.
బ్యాంక్ ఖాతా ప్రీ-వాలిడేషన్, ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తిచేయకపోవడం కూడా రీఫండ్ జాప్యానికి కారణమవుతుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఇవ్వడం, ఖాతా ప్రీ-వాలిడేట్ కాకపోవడం వల్ల రీఫండ్ నిలిచిపోతే, ఆ ఆలస్యానికి ప్రభుత్వం బాధ్యత వహించదు. అలాగే ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఇ-వెరిఫికేషన్ చేయకపోతే, వెరిఫై చేసిన తేదీ నుంచే రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. దీని వల్ల వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది.
ఇక ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులకు సకాలంలో స్పందించకపోయినా వడ్డీ హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. రిటర్న్‌లో తేడాలు ఉన్నప్పుడు వచ్చిన నోటీసులకు ఆలస్యంగా స్పందిస్తే, ఆ కారణంగా రీఫండ్ ఆలస్యమైతే వడ్డీని చెల్లించకుండా ఐటీ శాఖ నిలిపివేయవచ్చు. కాబట్టి ట్యాక్స్ పేయర్లు సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయడం, సరైన బ్యాంక్ వివరాలు ఇవ్వడం, వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.