భారత్ అంతర్జాతీయ వాణిజ్య వ్యూహంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ – FTA)పై చర్చలను విజయవంతంగా ముగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారత్ కుదుర్చుకున్న 18వ వాణిజ్య ఒప్పందంగా నిలవడం విశేషం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందం రూపుదిద్దుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం రాబోయే మూడు నెలల్లో అధికారికంగా సంతకం కావచ్చని, వచ్చే ఏడాది నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే ఉత్పత్తులపై 100 శాతం సున్నా సుంకం (జీరో డ్యూటీ) మార్కెట్ యాక్సెస్ లభించనుంది. అంటే భారత ఎగుమతిదారులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. వస్త్రాలు, దుస్తులు, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, రత్నాలు ఆభరణాలు, హస్తకళలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్ రంగానికి చెందిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో మరింత పోటీతత్వాన్ని సాధించే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందం గణనీయమైన లాభాలను చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వాణిజ్య ఒప్పంద చర్చలు 2025 మార్చి 16న ప్రారంభమయ్యాయి. అభివృద్ధి చెందిన దేశంతో అత్యంత వేగంగా కుదిరిన ఎఫ్‌టీఏలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజినీరింగ్ గూడ్స్, లెదర్ రంగం వంటి విభాగాల్లో భారత ఉత్పత్తులకు న్యూజిలాండ్ మార్కెట్‌లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. అంతేకాదు, భారత తయారీ రంగానికి అవసరమైన వుడ్ లాగ్స్, కోకింగ్ కోల్, మెటల్ వ్యర్థాలు వంటి ముడి పదార్థాలు డ్యూటీ ఫ్రీగా అందుబాటులోకి రానున్నాయి.
ఉపాధి అవకాశాల పరంగా కూడా ఈ ఒప్పందం ఎంతో కీలకం. న్యూజిలాండ్ ప్రభుత్వం 5,000 మంది భారత ప్రొఫెషనల్స్‌కు తాత్కాలిక ఉద్యోగ ప్రవేశ వీసాల కోటాను కేటాయించేందుకు అంగీకరించింది. అదనంగా 1,000 వర్క్ అండ్ హాలిడే వీసాలకూ అవకాశం కల్పించింది. దీంతో ఐటీ, ఇంజినీరింగ్, ఆరోగ్య రంగాల్లో నైపుణ్యం కలిగిన భారత యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
పెట్టుబడుల పరంగా చూస్తే, రాబోయే 15 సంవత్సరాల్లో భారత్‌లో 20 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించినట్లు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో ఆపిల్స్, కివీ పండ్లు, తేనె ఉత్పత్తుల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పాదకత పెంచే దిశగా సహకారం అందించనున్నారు. ఆయుష్, సంస్కృతి, మత్స్యకార రంగం, ఆడియో–విజువల్ టూరిజం, అటవీ, ఉద్యానవన రంగాల్లోనూ పరస్పర సహకారం పెరగనుంది.
ఈ ఒప్పందం కేవలం సుంకాల తగ్గింపుకే పరిమితం కాకుండా, నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించేలా నియంత్రణ పరమైన సహకారాన్ని కూడా కలిగి ఉంది. వాణిజ్య లావాదేవీల్లో పారదర్శకత, వేగం పెరగడం ద్వారా వ్యాపార వాతావరణం మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు. 2024–25లో భారత్–న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సరుకుల వాణిజ్యం 1.3 బిలియన్ డాలర్లకు చేరగా, వస్తువులు–సేవల మొత్తం వాణిజ్యం సుమారు 2.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త దిశగా అడుగులు వేస్తుండగా, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు ఈ ఒప్పందానికి బలమైన పునాది అయ్యాయి. మొత్తంగా చూస్తే, ఈ ఎఫ్‌టీఏ భారత్‌కు ఎగుమతులు, పెట్టుబడులు, ఉద్యోగాలు అనే మూడు ప్రధాన రంగాల్లో దీర్ఘకాలిక లాభాలను అందించే కీలక ఒప్పందంగా నిలవనుంది.