భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరూ కదిలించలేని విధంగా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ 2024 నుంచే అమల్లోకి వస్తుందని, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై అటార్నీ జనరల్‌తో విస్తృతంగా చర్చలు జరిగాయని, న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందన్న సందేహాలకు ఇక తెరపడిందని ఆయన వ్యాఖ్యానించారు.
తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన పెమ్మసాని, అమరావతికి త్వరలో ప్రత్యేక పిన్‌కోడ్‌తో పాటు ఎస్‌టిడీ, ఐఎస్‌డీ కోడ్‌లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమరావతికి కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, ఆయా కార్యాలయాల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. తాను పర్యవేక్షిస్తున్న తపాలా శాఖకు సంబంధించిన కేంద్ర కార్యాలయ పనులు మూడు నెలల్లోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ చర్యలతో అమరావతి పరిపాలనా కేంద్రంగా మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ వారిలో నమ్మకం, సంతృప్తి పెంచుతున్నామని పెమ్మసాని అన్నారు. అమరావతిలో జనసాంద్రత పెంచేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని రాజధానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కాంప్లెక్సులు, హైకోర్టు భవనాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలను రెండేళ్లలో పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అమరావతి ప్రాంతంలో రైలు, రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ఎల్‌పీఎస్ లేఅవుట్ల పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన వివరించారు. ప్లాట్ల పరిమాణాలను తగ్గిస్తే హైదరాబాద్‌లోని పాతబస్తీ తరహా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే విశాలమైన ప్రణాళికతో, పచ్చదనం, మౌలిక సదుపాయాలతో కూడిన వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని చెప్పారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులు అందరూ కలిసి ముందుకు రావాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.