దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లను వాడాలంటే తప్పనిసరిగా సిమ్ కార్డు ఫోన్‌లో అమర్చివుండాలి. ఇప్పటి వరకు వినియోగదారులు ఒక ఫోన్‌లో సిమ్ ఉంచి, ఆ సిమ్‌కి వచ్చే ఓటీపీతో వేరే ఫోన్‌లో కూడా యాప్‌ను ఉపయోగించగలిగారు. ఈ లోపాన్ని సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఫలితంగా 'టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు – 2025'ని విడుదల చేసి, ఇకపై సిమ్ బైండింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, సోషల్ మీడియా యాప్‌లు ఇకపై సిమ్ లేకుండా లాగిన్ లేదా యాక్సెస్‌ను అనుమతించకూడదు. టెలికమ్యూనికేషన్ విభాగం వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్ వంటి కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. కొన్ని యాప్‌లు వినియోగదారు ఫోన్‌లో సిమ్ లేకున్నా పనిచేసే సౌకర్యాన్ని ఇస్తుండటం వల్ల సైబర్ మోసగాళ్లకు ఇది ఒక పెద్ద ఆయుధంలా మారింది. ఎక్కడో దూర ప్రాంతంలో కూర్చొని ఇతరుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలు చేయడం ఎక్కువైంది. బ్యాంక్‌లు, యూపీఐ అప్లికేషన్లు ఇప్పటికే సిమ్ బైండింగ్ విధానాన్ని అనుసరిస్తున్నందున, సోషల్ మీడియా యాప్‌లూ అదే మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటి వరకూ యాప్‌ను ఒకసారి వెరిఫై చేసి లాగిన్ అయ్యాక సిమ్ కార్డు ఫోన్ నుండి తీసివేసినా, యాప్‌లో లాగిన్ కొనసాగేది. ఈ విండోను ఉపయోగించి నేరగాళ్లు ఇతరుల వేరిఫికేషన్ తీసుకుని తమ ఫోన్లలో ఖాతాలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, లింకుల ద్వారా ప్రజలను మోసం చేసే కేసులు భారీగా పెరిగాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులుగా నటిస్తూ డబ్బులు కాజేయడం, నకిలీ ఉద్యోగాలు చూపించడం, విదేశీ పెట్టుబడుల పేరుతో మోసాలు చేయడం వంటి ఘటనలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసి ఉండటం వల్ల యాప్ అకౌంట్లు అసలు వినియోగదారుని ఫోన్‌కే పరిమితం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో సైబర్ నేరాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సిమ్ బైండింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సిమ్‌కు ఒకే ఫోన్‌లో మాత్రమే యాప్ యాక్సెస్ పరిమితం అవుతుంది. దీంతో నకిలీ లాగిన్లు, అనామక ఖాతాలు, ఫేక్ ఐడెంటిటీలకు అడ్డుకట్ట పడనుంది. సోషల్ మీడియా ఖాతాల్లో జరిగే అనేక స్కామ్‌లు, అకౌంట్ దొంగతనాలు, ఫేక్ OTP ట్రిక్స్ కూడా తగ్గుతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ముఖ్యమైన మలుపుగా మారనుంది.