స్వల్పంగా రూటు మార్చిన అక్వాన్ తుఫాన్! విశాఖ వాసులకు గండం! హెచ్చరికలు జారీ!
Andhra Pradesh Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫానులు వణికిస్తున్నాయి. గత 20 రోజుల వ్యవధిలో ఆర్నబ్, మురసు తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా.. వాటి ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే అక్వాన్ తుఫాన్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి తుఫానుగా, రేపటికి తీవ్ర తుఫానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నాటికి నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశాలు ఉండటంతో తీర ప్రాంత ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొంది.
- అక్వాన్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 19న ఏపీలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక.. రెడ్ అలర్ట్ జారీ.
- గత రెండు తుఫాన్లతో వేల కోట్ల నష్టం.. మరోసారి పంటలు, విద్యుత్, మౌలిక సదుపాయాలకు అక్వాన్ ముప్పు!
Andhra Pradesh Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫానులు వణికిస్తున్నాయి. గత 20 రోజుల వ్యవధిలో ఆర్నబ్, మురసు తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా.. వాటి ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే అక్వాన్ తుఫాన్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి తుఫానుగా, రేపటికి తీవ్ర తుఫానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నాటికి నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశాలు ఉండటంతో తీర ప్రాంత ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొంది.
19న పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 19న, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వరుస వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, అరటి పంటలపై తుఫాన్ ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
రెండు తుఫాన్లతో వేల కోట్ల నష్టం
గత అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారంలో వచ్చిన ఆర్నబ్, మురసు తుఫాన్లు ఏపీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆర్నబ్ తుఫాన్ కారణంగా దాదాపు రూ.4,526 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. 3.5 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ పంటలు, 23 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఇక ఆ నష్టం నుంచి కోలుకోకముందే వచ్చిన మురసు తుఫాన్ మరో రూ.2,484 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దాదాపు 1,400 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వేలాది హెక్టార్లలో పంటలు నీటమునగడంతో సుమారు 86 వేల మందికి పైగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు తుఫాన్ల ప్రభావంతో 47 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అనేక గ్రామాలు చీకట్లో మగ్గాయి.
చంద్రబాబు ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారణ
వరుస తుఫాన్ల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో వ్యవహరించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS), శాటిలైట్ సమాచారాన్ని ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 1.60 లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రాణనష్టాన్ని నివారించగలిగారు.
సాధారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయినప్పుడు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కనీసం 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే చంద్రబాబు స్వయంగా పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించారు. ఫలితంగా కేవలం నాలుగైదు రోజుల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే రంగంలోకి దించడం, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, నిత్యావసరాలు అందించడం వంటి చర్యలు చేపట్టారు. కేంద్ర బృందాలను కూడా రప్పించి నష్టాన్ని అంచనా వేయించారు.
అక్వాన్‌తో పంటలకు మరోసారి ముప్పు
ఇప్పటికే రెండు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు అక్వాన్ తుఫాన్ హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, అరటి పంటలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటే విద్యుత్ స్తంభాలు, బలహీనమైన ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
అప్రమత్తమైన ప్రభుత్వం.. ముందస్తు చర్యలు
మరో తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సాధ్యమైనంత వరకు కాపాడుకోవాలని రైతులకు సూచిస్తోంది. తీర ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన ఏపీకి అక్వాన్ తుఫాన్ ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Be the first to react